వెదురు బ్యాట్లు వద్దు..  రూల్స్​ ప్రకారం చట్ట విరుద్ధం

వెదురు బ్యాట్లు వద్దు..  రూల్స్​ ప్రకారం చట్ట విరుద్ధం


లండన్: వెదురుతో క్రికెట్ బ్యాట్లను తయారు చేయాలన్న ఆలోచనను మెరిల్‌బోన్​ క్రికెట్​క్లబ్​(ఎంసీసీ) కొట్టి పారేసింది. ప్రస్తుతం క్రికెట్ రూల్స్‌ ప్రకారం అలాంటి బ్యాట్లు వాడడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయంపై తమ లా- సబ్​ కమిటీ మీటింగ్​లో  కూలంకషంగా చర్చిస్తామని  క్రికెట్‌ రూల్స్​ను సంరక్షించే​ ఎంసీసీ తెలిపింది.  ప్రస్తుతం ఇంగ్లిష్  విల్లో (చెక్క), కాశ్మీర్ విల్లో తయారు చేసిన బ్యాట్లనే ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. కానీ ఆ చెక్కకు బదులు వెదురును ఉపయోగించి తక్కువ ఖర్చుతో బ్యాట్లు తయారు చేయొచ్చని, పైగా రెగ్యులర్​బ్యాట్లతో పోలిస్తే  ఇవి మరింత స్ట్రాంగ్‌గా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్​ చేసిన ఓ అధ్యయనంలో తేలింది.  అయితే ఐసీసీ రూల్‌ 5.3.2  ప్రకారం కేవలం వుడ్‌తో చేసిన బ్యాట్లను  మాత్రమే క్రికెట్‌లో వినియోగించాలి. ప్రత్యామ్నాయంగా వెదురుతో బ్యాట్లను తయారు చేయాలంటే ముందుగా రూల్స్​ను మార్చాల్సి ఉంటుందని ఎంసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.  వెదురు బ్యాట్లు.. దృఢంగా, మన్నికగా ఉంటాయని, పైగా బ్యాట్‌లో స్వీట్​స్పాట్‌ పరిధి ఎక్కువగా ఉంటాయని కేంబ్రిడ్జ్‌ రీసెర్చ్‌ టీమ్‌ తెలిపింది. దాని వల్ల యార్కర్లను ఈజీగా ఫోర్లుగా కొట్టొచ్చని చెప్పింది. కానీ, ఆటలో బ్యాట్​కు బాల్‌కు మధ్య  బ్యాలెన్స్‌ దెబ్బతినకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందని ఎంసీసీ చెబుతోంది.