హర్యానాలో కాల్పుల కలకలం.. వైన్ షాపుపై 12 రౌండ్ల కాల్పులు.. దుండగుడు పరార్...

హర్యానాలో కాల్పుల కలకలం.. వైన్ షాపుపై 12 రౌండ్ల కాల్పులు.. దుండగుడు పరార్...

హర్యానాలో ఓ వైన్ షాపుపై కాల్పుల ఘటన కలకలం రేపింది. మాస్క్ ధరించిన దుండగుడు వైన్ షాపుపై 12 రౌండ్ల కాల్పులు జరపడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. దుండగుడు కాల్పులు జరిపి, ఘటనా స్థలంలో ఓ బెదిరింపు లేఖను వదిలిపెట్టి పరారైనట్లు తెలిపారు పోలీసులు. స్థానికులు సమాచారం అందించటంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందాలు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు గాలింపు ప్రారంభించారు.కాల్పుల కారణంగా వైన్ షాపు అద్దాల డోర్ పూర్తిగా ధ్వంసమైంది.

గ్యాంగ్ తగాదాలు, బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్ ప్రమేయమే కాల్పులకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా దర్యాప్తు చేసేందుకు సహకరించాలని స్థానికులను కోరారు పోలీసులు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వైన్ షాపు పరిసరాలు కాస్తా.. కాల్పుల ఘటనతో ఉద్రిక్తంగా మారాయి.

ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో హర్యానాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 2024 డిసెంబర్‌లో యమునా నగర్‌లోని ఓ జిమ్ బయట కాల్పులు కలకలం రేపాయి... జిమ్ బయట కారులో కూర్చున్న ముగ్గురు యువకులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

బైక్ పై వచ్చిన ఆరుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గతేడాది సెప్టెంబర్‌ కూడా సోనిపట్‌లోని ఓ వైన్ షాపు దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించగా..  ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హర్యానాలో మాఫియా ఆగడాలు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.