గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులతో సోషల్ మీడియాను ఊపేస్తుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ లోకి రాకముందే ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించేందుకు 'పెద్ది' టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది.
టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా.. ఒక సరికొత్త రికార్డ్‌కు వేదిక కాబోతోంది బెజవాడ. జూన్ 1వ తేదీన విజయవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దాదాపు 25 వేల మందికి పైగా కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో.. మెగా పవర్ స్టార్ మాస్ జాతరను క్రియేట్ చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం నిర్మాత వెంకట సతీష్ కిలారు బడ్జెట్ విషయంలో అస్సలు వెనకడుగు వేయకుండా కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్‌ను డిజైన్ చేస్తున్నారు.
రీసెంట్‌గా భోపాల్‌లో జరిగిన బాలీవుడ్ ప్రమోషనల్ ఈవెంట్ నార్త్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది. కానీ, ఇప్పుడు విజయవాడలో జరగబోయే ఈవెంట్ అంతకు మించి, టాలీవుడ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోయేలా ఉండబోతోందని టాక్. ఈ మెగా సెలబ్రేషన్‌కు టాలీవుడ్‌లోని పలువురు టాప్ స్టార్స్, ఇండస్ట్రీ దిగ్గజాలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం.
జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్, జగపతిబాబు నటన.. వీటన్నిటికీ తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ ‘పెద్ది’ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 1న బెజవాడ వేదికగా జరగబోయే ఈ మాస్ సెలబ్రేషన్ టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్ కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్, ఫ్యాన్స్..
