Mass Jathara Review: రవితేజ 'మాస్ జాతర' రివ్యూ.. ఈ సారైనా హిట్ కొట్టాడా?

Mass Jathara Review: రవితేజ 'మాస్ జాతర' రివ్యూ.. ఈ సారైనా హిట్ కొట్టాడా?

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీలల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ 'ధమాకా' తర్వాత కలిసి నటించిన చిత్రం 'మాస్ జాతర'. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ ఇద్దరూ మరో సారి జతకట్టారు. ఈ మూవీ అక్టోబర్ 31న విదుడలవుతుందని మేకర్స్ ప్రకటించినా.. 'బాహుబలి ది ఎపిక్' దెబ్బకి ప్రీమియర్స్ కే పరిమితమైంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఈరోజు నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది.  మరోసారి భీమ్స్ సిసిరోలియో సంగీతం, భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ 'మాస్ జాతర' రవితేజకు హిట్ ఇచ్చిందా? అంచనాలు అందుకుందా? లేదా తెలుసుకుందా.. 

 రొటీన్ ఫార్ములా, ఎలివేషన్స్ హై..

కథ విషయానికి వస్తే, ఇది రవితేజకు బాగా అచ్చొచ్చిన ఖాకీ యాక్షన్  డ్రామా  ' మాస్ జాతర '.  ఇందులో లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక పవర్‌ఫుల్ రైల్వే పోలీసు అధికారి. తన పరిధి కాకపోయినా అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం అతనిది. ఈ క్రమంలోనే వరంగల్‌లో ఓ కేసులో మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అక్కడి నుంచి అల్లూరి జిల్లాలోని అడవివరం అనే మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అయితే ఆ ప్రాంతం మొత్తం శివుడు (నవీన్ చంద్ర) అనే గంజాయి స్మగ్లర్ కంట్రోల్‌లో ఉంటుంది. జిల్లా ఎస్పీ నుంచి రాజకీయనాయకుల అండదండలు ఉన్న శివుడికి ఉంటాయి. మరి ఆ శివుడు సామ్రాజ్యాన్ని, కేవలం రైల్వే ఎస్సై అయిన లక్ష్మణ్ భేరి ఎలా అడ్డుకున్నాడు? తులసి (శ్రీలీల) పాత్ర ఈ కథలో ఎలా కీలకంగా మారింది? అన్నదే అసలు కథ.

రవితేజ ఎనర్జీ, యాక్షన్

రవితేజ నటన, ఎనర్జీ ఈ సినిమాకు ప్రధాన బలం. లక్ష్మణ్ భేరి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఫ్యాన్స్ కోరుకునే విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ డైలాగ్‌లు, హుషారైన స్టెప్పులతో తెరపై సందడి చేశారు. ఆయన వింటేజ్ స్టైల్, స్వాగ్ కొన్ని చోట్ల 'విక్రమార్కుడు', 'క్రాక్' సినిమాలను గుర్తు చేస్తాయి. శ్రీలీల మూడు కోణాల్లో సాగే తులసి పాత్రకు న్యాయం చేసింది, ముఖ్యంగా పాటల్లో రవితేజతో కలిసి వేసిన స్టెప్పులు మెప్పిస్తాయి. విలన్‌గా నవీన్ చంద్ర విలనిజం ఆరంభంలో ఆకట్టుకున్నా, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కాస్త బలహీనపడింది. హీరో తాతయ్యగా రాజేంద్ర ప్రసాద్‌ కామెడీతో పాటు, సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సర్ప్రైజ్ చేస్తుంది.

 

ఎలివేషన్స్‌కే ప్రాధాన్యం

దర్శకుడు భాను భోగవరపు కథ-కథనంపై కాకుండా, కేవలం రవితేజ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరిచే మాస్ ఎలివేషన్స్‌, యాక్షన్ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  రమితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు.  రైల్వే పోలీసు అధికారిగా లక్షణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయారని ..  యాక్షన్ సీన్లు అదరగొట్టేశారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే  సినిమాను ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలుపెట్టినా, కొంతసేపటికే కథనం రొటీన్‌గా మారుతుంది. పాత సినిమాల్లోని సంఘర్షణే మళ్లీ చూపించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌ పర్వాలేదు. కానీ, సెకండాఫ్‌లో లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ బలహీనంగా మారాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు..

అయితే, యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం సినిమాకు హైలైట్ గా నిలచింది. ముఖ్యంగా విలన్ మామ గ్యాంగ్‌తో వచ్చే అడవి ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయయని చెప్పుకొస్తున్నారు.. భీమ్స్ నేపథ్య సంగీతం బాగా ఉన్నా, పాటల ప్లేస్‌మెంట్ ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయని అంటున్నారు.

 

 అభిమానులకు జాతర..

'మాస్ జాతర' అనేది రవితేజ అభిమానుల కోసం రూపొందించిన పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. రొటీన్ కథ-కథనాన్ని పక్కన పెడితే, రవితేజ ఎనర్జీ, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు పండగలా అనిపిస్తాయి. కానీ, కొత్తదనం ఆశించే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఇప్పటికే చాలాసార్లు చూసిన 'ఖాకీ కథ' లాగే అనిపిస్తుంది. రవితేజ వింటేజ్ ఎనర్జీ, యాక్షన్ కోసం ఈ'మాస్ జాతర'కు ఒకసారైనా చూడొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.