ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆరింటికి ఆరు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే 5 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరిగితే.. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ 4 జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నాయకులు అంటున్నారు. కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓట్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. కరీంనగర్ లో 2 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓట్లు అటూఇటూ పడ్డట్లు సమాచారం. కరీంనగర్ లో కాంగ్రెస్, బీజేపీ ఓట్లు టీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీందర్ సింగ్ కు పోలైనట్లు తెలుస్తోంది. 

మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా... కాంగ్రెస్ కు ఉన్న ఓట్ల కంటే ఎనిమిది ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బలం కన్నా... ఒక్క ఓటు తక్కువ వచ్చినా... తన పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి సవాల్ చేశారు. ఆయన నమ్మకం నిలబడింది. పార్టీకున్న ఓట్ల కంటే... 8 ఓట్లు ఎక్కువే కాంగ్రెస్ కు వచ్చాయి. 

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థికి కాకుండా అపోజిషన్ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రావు 480 ఓట్లు సాధించారు. తమకు ఓట్లు లేకున్నా బరిలో నిలిచిన కాంగ్రెస్ కు 242 ఓట్లు వచ్చాయి. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే తమకు రావాల్సిన చాలా ఓట్లు క్రాస్ అయినట్లు విజయం సాధించిన మధు అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు 116 ఓట్లు మాత్రమే ఉన్నాయని.. దాదాపు 141 ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించామని, వారెవరో తమకు తెలియదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తాతా అన్నారు.

ఆదిలాబాద్ లో మాత్రం ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ కు ఓట్లు క్రాస్ అయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బరిలో లేకపోవటం, తుడుం దెబ్బ అభ్యర్థి పోటీలో ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ ఓట్లు టీఆర్ఎస్ కు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ కు 552, ఎంఐఎంకు 22 ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపి టీఆర్ఎస్ కు 574 ఓట్లు ఉంటే.. టీఆర్ఎస్ అభ్యర్థికి 742 ఓట్లు వచ్చాయి. అంటే 168 ఓట్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది.