V6 News

చివ్వెంల మండలం లోని బ్రిక్స్ పరిశ్రమలో భారీ పేలుడు

చివ్వెంల మండలం లోని బ్రిక్స్ పరిశ్రమలో భారీ పేలుడు
  •     పేలుడు దాటికి 500 మీటర్ల దూరం ఎగిరిపడ్డ లోహపు ముక్కలు  

చివ్వెంల, వెలుగు: చివ్వెంల మండలం, బీబీగూడెం గ్రామంలోని బాలాజీ సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. అధిక ఒత్తిడి తట్టుకోలేక పరిశ్రమలోని హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి ప్లాంట్‌కు సంబంధించిన విడిభాగాల శకలాలు, లోహపు ముక్కలు సుమారు 500 మీటర్ల దూరం వరకు గాల్లోకి ఎగిరిపడ్డాయి. 

ఈ భారీ శబ్దంతో జరిగిన పేలుడు తీవ్రతతో సమీపంలోని చివ్వెంల, మున్యా నాయక్ తండా, బీబీగూడెం గ్రామ ప్రజలు ఉలిక్కిపడి భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం తెల్లవారుజామున సంభవించడం ఆ సమయంలో ప్లాంట్‌లో కార్మికులు లేదా ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం తప్పింది. ఒకవేళ పగటిపూట ఈ ఘటన జరిగి ఉంటే భారీ నష్టం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. 

ఈ ఘటనతో తమ భద్రతకు ముప్పు ఉందని సమీప గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్‌లోని ప్రమాదకరమైన యంత్రాలు, అధిక ఒత్తిడి ట్యాంకుల వల్ల ప్రాణ నష్టం జరగవచ్చనే భయంతో ఈ సిమెంట్ బ్రిక్స్ ప్లాంట్‌ను తక్షణమే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పరిశ్రమ వద్దకు చేరుకుని పేలుడుకు గల కారణాలు, పరిశ్రమ నిర్వహణలో లోపాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.