
- మరో ఐదుగురి పరిస్థితి విషమం..షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం!
- ఆసుపత్రి యాజమాన్యంపై బాధిత కుటుంబ సభ్యుల ఆగ్రహం
జైపూర్: రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉన్న సవాయ్ మాన్ సింగ్ (ఎస్‌ఎంఎస్) హాస్పిటల్లో ఆదివారం (అక్టోబర్ 06) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని ట్రామా సెంటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు.
మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ మీడియాకు వెల్లడించారు. "ట్రామా సెంటర్ రెండో అంతస్తులో ఉన్న న్యూరో ఐసీయూ స్టోరేజ్ ఏరియాలో మంటలు మొదలయ్యాయి. వార్డు మొత్తం విషపూరిత పొగతో నిండిపోయింది. ప్రమాద సమయంలో ట్రామా ఐసీయూ, సెమీ -ఐసీయూలలో మొత్తం 24 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. పొగను చూసి తమ సిబ్బంది, నర్సింగ్ అధికారులు, వార్డ్ బాయ్‌లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలు కష్టపడి మంటలను అదుపుచేశారు.
హాస్పిటల్ సిబ్బంది పారిపోయారు
ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారని పేషెంట్ల బంధవులు ఆరోపించారు. ఐసీయూలో మంటలను ఆర్పేందుకు ఫైర్ సేఫ్టీ వంటి ఎలాంటి పరికరాలు లేవని చెప్పారు. పొగ వ్యాపించడానికి ముందే తాము సిబ్బందికి హెచ్చరికలు చేశామని అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సోమవారం ఉదయం హాస్పిటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఆరుగురు మంత్రులతో హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేశారు.