హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఒక్కసారిగా చెలరేగిన మంటలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. మియాపూర్ కల్వరి టెంపుల్ సమీపంలో ఉన్న ఫర్నీచర్ హోమ్స్ షాపులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఫర్నీచర్ షాపు కావడంతో మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 70 లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ పూర్తిగా అగ్నికి ఆహుతై బూడిదైందని అంచనా వేస్తున్నారు.
మంటల ధాటికి ఫర్నీచర్ షాపు మాత్రమే కాకుండా, దానికి ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఏసీ అవుట్‌డోర్ యూనిట్లు కూడా కాలిపోయాయి. అపార్ట్‌మెంట్ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
