సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం మెదలైంది గజ్వేల్ నుంచేనన్నారు. త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఇందుకు సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నట్లు తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఎస్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా? టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని స్పష్టం చేశారు. శనివారం ఈటల మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే..ఈగోలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పనిచేయాలని బీజేపీ నేతలకు సూచించారు. బెంగాల్ లో సువేందు అధికారి తరహాలో.. కేసీఆర్ ను ఓడించి తీరుతానని తెలిపారు. అర్జునుడికి పక్షి తల మాదిరి కేసీఆర్ మాత్రమే కనిపించాలని, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమైనట్లు తెలిపారు. రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
