టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎కు భారీ బందోబస్తు.. వెయ్యికిపైగా సీసీ కెమెరాలు.. వీవీఐపీల చుట్టూ మూడంచెల భద్రత

టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎కు భారీ బందోబస్తు.. వెయ్యికిపైగా సీసీ కెమెరాలు.. వీవీఐపీల చుట్టూ మూడంచెల భద్రత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025, డిసెంబర్ 8, 9వ తేదీల్లో మహేశ్వరంలోని మిర్ఖాన్ పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎ను నిర్వహించనుంది. ఈ క్రమంలో టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో శుక్రవారం (నవంబర్ 28) రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు శాఖకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి.. పోలీసు శాఖ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనే దానిపై నిర్వాహక కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సదస్సుకు సుమారు 2,500 మంది పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తునందున లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్స్‎తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమ్మిట్‎కి కావాల్సిన సదుపాయాలపై బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయల గురించి అధికారులతో చర్చించారు. 

ఈ గ్లోబల్ సమ్మిట్‎కి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల ప్రతినిధులు, బహుళ సంస్థల అధినేతలు, దేశీయ సంస్థల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో కలిపి సుమారు 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి సహాయక సిబ్బంది సుమారు మూడు వేల మంది రానున్నారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ పోలీసు కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉంటాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నారు. 

రహదారుల మళ్లింపు, రూట్ మ్యాప్‎లు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి వాటి కోసం ట్రాఫిక్ మార్షల్స్ నియమించుకోనున్నారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు జరగకుండా ఆయా మార్గాలను పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది. సాధారణ ప్రజలు, వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాలలో రహదారుల మళ్లింపులు ఉంటాయి. మహిళా పారిశ్రామికవేత్తలు, వక్తల, పెట్టుబడిదారుల భద్రత, రక్షణ కోసం ఉమెన్స్ వింగ్, షీ టీమ్స్ ప్రత్యేకంగా వింగ్ నీ ఏర్పాటు చేశారు.