ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడటం ఈ రోజుల్లో ప్రజలకు ఒక వ్యసనం లాగా మారిపోయింది. మనం ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేసే బిర్యానీ నుంచి పిజ్జా వరకూ ఆర్డర్ చేసుకుని తింటున్నాం. అయితే ఆన్ లైన్ ఆర్డర్ రేట్లకు.. నేరుగా హోటల్‌కు వెళ్లి తినే రేటుకు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటోందా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. నళిని అనే మహిళ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఫుడ్ లవర్స్ మధ్య పెద్ద చర్చకు దారితీసింది.
నళిని అనే కస్టమర్ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్న తర్వాత వచ్చిన ఫిజికల్ బిల్లును, అదే సమయంలో జొమాటో యాప్‌లో అదే వంటకాలకు చూపిస్తున్న ధరను స్క్రీన్‌షాట్ తీసి పోస్ట్ చేసింది. ఆశ్చర్యకరంగా రెస్టారెంట్లో ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ బిల్లు కేవలం రూ.320 మాత్రమే. కానీ అదే ఐటమ్స్‌ను జొమాటోలో ఆర్డర్ చేస్తే రూ.655 చూపిస్తోంది. డిస్కౌంట్స్ అప్లై చేసిన తర్వాత కూడా కట్టాల్సిన మెుత్తం బిల్ రూ.550 చూపించినట్లు ఆమె పేర్కొంది. అంటే దాదాపు రూ.230 అదనంగా భారం పడుతోంది. ఇది కస్టమర్లను లూటీ చేయటమేనని ఆమె అంటోంది.
Also Read : 2026లో ప్రపంచం నాశనం అవుతుందా..?
అయితో సోషల్ మాడియాలో దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు కన్వీనియన్స్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని అంటున్నారు. దుప్పటి కప్పుకుని హాయిగా ఇంట్లో కూర్చుని ఫుడ్ పొందాలనుకున్నప్పుడు.. ఆ టెక్నాలజీకి, డెలివరీ బాయ్ కష్టానికి ధర చెల్లించాల్సిందే అని ఒక యాజర్ కామెంట్ చేయగా, వ్యాపారంలో ఉచిత భోజనాలు ఉండవు, సౌకర్యానికి వెల కట్టాల్సిందే అని ఫిన్‌టెక్ నిపుణులు అంటున్నారు.
అయితే ఈ వివాదంపై జొమాటో అధికారికంగా స్పందించింది. ఫుడ్ రేట్ల నిర్ణయంలో తమ పాత్ర ఏమీ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌లో ధరలను రెస్టారెంట్ భాగస్వాములే నిర్ణయిస్తారని.. తాము కేవలం కస్టమర్లకు, హోటళ్లకు మధ్య ఒక వారధిగా మాత్రమే వ్యవహరిస్తాం అని తేల్చి చెప్పింది. అయితే కస్టమర్ అభిప్రాయాన్ని సంబంధిత రెస్టారెంట్‌కు చేరవేస్తామని హామీ ఇచ్చింది.
కేవలం ధరలే కాకుండా.. ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ కూడా తగ్గుతోందని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. మొత్తానికి ఆన్లైన్ ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసే ముందు మెనూ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిదని ఈ పోస్ట్ హెచ్చరిస్తోంది.
