
అమృత్ సర్: వ్యవసాయ బిల్లులపై పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లో కాంగ్రెస్ భారీస్థాయిలో నిరసన తెలిపింది. ట్రాక్టర్లపై రైతులతో కలిసి కాంగ్రెస్ వర్కర్లు.. ర్యాలీ నిర్వహించారు. నిరసనలో కాంగ్రెస్ నేత నవజ్యోతి సింగ్ సిద్దూ పాల్గొన్నారు. రైతు వ్యతిరేక బిల్లులను అమలుచేయొద్దని డిమాండ్ చేశారు.రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ నిరసనలు తీవ్రం చేయడంతోపాటు ఈ నెల 25న రాష్ట్ర బంద్‌కు పంజాబ్ రైతులు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ కూడా రైతుల నిరసనలకు మద్దతుగా నిలిచాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన శిరోమణి అకాలీదళ్ కూడా 25న రహదారుల దిగ్బంధం, అక్టోబర్ 1న భారీ రైతు ర్యాలీకి పిలుపునిచ్చింది. ఆ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.