
- అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షట్టర్ డౌన్, వీల్ జామ్
- పీవోకే చరిత్రలోనే అతిపెద్ద నిరసన
- ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి..
- 22 మందికి గాయాలు
- ఇంటర్నెట్ నిలిపేసి, పోలీసులను మోహరించిన పాక్ సర్కారు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సర్కారుకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో భారీ నిరసనలు చెలరేగాయి. హక్కుల అణచివేతపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. పౌర సమాజ కూటమి అయిన అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘షట్టర్ డౌన్, వీల్ జామ్’ పేరుతో నిరవధిక బంద్‌కు పిలుపునివ్వగా.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తూ జనం కదంతొక్కడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
ముజఫరాబాద్‌లో నిరసనలో పాల్గొన్న పౌరులపై పాక్‌సైన్యం, ఐఎస్‌ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 22 మంది గాయపడ్డారు. కాగా, పీవోకే వ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపేసిన పాక్‌సర్కారు.. భారీగా పోలీసులను మోహరించింది.
38 డిమాండ్ల కోసం ఆందోళన..
దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగుతున్నదంటూ ఏఏసీ ఆధ్వర్యంలో ప్రజలు గళమెత్తారు. మొత్తం 38 డిమాండ్లను పాక్ సర్కారు ముందుంచారు. పీవోకే అసెంబ్లీలో పాకిస్తాన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీట్ల వల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. వీటితోపాటు గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని, మంగ్లా జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీటిపై ఏఏసీతో పాక్ సర్కారు చర్చలు జరిపినా.. సఫలం కాలేదు. దీంతో ఏఏసీ ఆందోళన ఉధృతం చేసింది. మార్కెట్లు, షాపులు, స్థానిక వ్యాపారాలు మూసేసి.. రవాణాను స్తంభింపజేసిన స్థానికులు నిరసన బాట పట్టారు. తమ పోరాటం ఏ సంస్థకూ వ్యతిరేకం కాదని, 70 ఏండ్లుగా తమకు నిరాకరించిన హక్కుల కోసమే పోరాడుతున్నామని ఏఏసీ కీలక నేత షౌకత్ నవాజ్ మీర్ తెలిపారు. మరోవైపు, ఈ ఆందోళనను అణచివేసేందుకు పాక్ సర్కారు భారీగా పోలీసులను రంగంలోకి దించింది.
పొరుగున ఉన్న పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులను, ఇస్లామాబాద్‌నుంచి మరో వెయ్యి మంది జవాన్లను పంపింది. పీవోకే పట్టణాల గుండా సాయుధ గస్తీ దళాలు భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్టు డాన్వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది.