- మెఫెడ్రిన్ తయారీలో వినియోగించే రామెటీరియల్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టు అయ్యింది. షాద్‌నగర్ కేంద్రంగా మెఫెడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్న ఎస్ఆర్ ఇన్నొవేషన్స్ కంపెనీలో రాష్ట్ర ఈగల్ ఫోర్స్ శుక్రవారం సోదాలు నిర్వహించింది. కేసు వివరాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా ఆదివారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఎస్ఆర్ ఇన్నొవేషన్ కంపెనీలో మెఫెడ్రిన్ సింథటిక్ డ్రగ్ ముడిసరుకు తయారు చేస్తున్నట్లు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ కు సమాచారం అందింది.
రా మెటీరియల్ ను రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు.ఖండౌలీ పోలీసుల సహకారంతో ఈ నెల 6న ఈగల్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించి డ్రగ్స్ తయారు చేస్తున్న మనోజ్ కుమార్ సతీశ్‌ను అరెస్టు చేశారు. రాజస్థాన్ అంబాలాకు చెందిన వీరేంద్ర స్వామితో కలిసి ఎండీఎంఏ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఎస్ఆర్ ఇన్నొవేషన్స్, ఖండౌలీ సెమ్రాలోని షట్టర్ లో సోదాలు నిర్వహించారు. 120 లీటర్ల మిథైలమైన్, 27.5 లీటర్ల హైడ్రోబ్రోమిక్ యాసిడ్ సహా మొత్తం 300 లీటర్ల సింథటిక్ డ్రగ్స్ తయారీకి వినియోగించే రా మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ కుమార్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
