
వెలుగు, సికింద్రాబాద్, శంషాబాద్: సిటీలో పెట్రోల్ బంక్ల వద్ద మంగళవారం మధ్యాహ్నం నుంచి గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసుల్లో తెచ్చిన మార్పులతో దేశవ్యాప్తంగా పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు చేపట్టిన సమ్మె ఎఫెక్ట్ సిటీని తాకింది. పెట్రోల్ ట్యాంకర్లు డ్రైవర్లు సమ్మె విషయం తెలుసుకున్న వాహనదారులు బంక్ల వద్ద క్యూ కట్టారు. సమ్మె ఎన్ని రోజులు ఉంటుందోననే భయంతో చాలామంది ఫుల్ ట్యాంక్ చేయించుకొన్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు.
బంకుల్లో నిలిపేందుకు స్థలం లేక వాహనాదారులు రోడ్లపైనే వెయిట్ చేశారు. దీంతో తీవ్ర ట్రాఫిక్జామ్ అయింది. క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడ్డారు. డ్రైవర్లు సమ్మె విరమించారంటూ సోషల్మీడియాలో న్యూస్ వైరల్ కాగా.. వాహనదారులు అవేమీ పట్టించుకోకుండా బంక్ల వద్ద రాత్రి వరకు వెయిట్ చేసి పెట్రోల్, డీజిల్ పోయించుకుని వెళ్లారు. మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఉండటంతో చర్లపల్లి ఏరియాలో జోమాటో డెలివరీ బాయ్ గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ చేశాడు.