- ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా 86. 64 శాతం పోలింగ్
- దహెగాం మండలంలో 90.44 శాతం, మంచిర్యాల జిల్లా కన్నెపల్లి 90.37 పర్సంటేజ్
- తాండూర్ మండలంలో 68.6 శాతమే..
- ప్రశాంతంగా ముగిసిన రెండో విడత
ఆసిఫాబాద్/మంచిర్యాల/నిర్మల్/, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు. భారీగా తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ ఏకంగా 86.64 శాతం ఓటింగ్నమోదైంది. ఉదయం చలిలోనూ పోలింగ్కేంద్రాలకు తరలివచ్చి ఓపిగ్గా లైన్ నిల్చొని, ఓటు వేశారు. వృద్ధులు, వికలాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. లంచ్ తర్వాత అధికారులు కౌంటింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. పోలింగ్జరిగిన ఏడు మండలాల్లో మొత్తం 1,31,278 ఓట్లకు గాను 1,13,733 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా దహెగాం మండలంలో 90.44 శాతం పోలింగ్ నమోదైంది. పెంచికలపేట్ మండలంలో బొంబాయి గూడా, చెడువ్యాయి గ్రామపంచాయతీల్లో పోలింగ్ ఎన్నికల సరళిని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా పరిశీలించారు.
మంచిర్యాల జిల్లాలో 84.59 శాతం పోలింగ్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, వేమనపల్లి మండలాల్లోని 111 సర్పంచ్, 873 వార్డులకు ఆదివారం ఎన్నికల నిర్వహించారు. మొత్తం 1,37,382 ఓట్లకు గాను 1,08,808 ఓట్లు (84.59 శాతం) పోలయ్యాయి. కన్నెపల్లి మండలంలో 14,781 ఓట్లకుగాను 13357 ఓట్లు పోలై అత్యధికంగా 90.37 పర్సెంటేజ్నమోదైంది.
కాగా తాండూర్ మండలంలో అతి తక్కువగా 68.6 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ భాస్కర్, ఏసీపీలు ప్రకాశ్, రవికుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల తీరును పరిశీలించారు. 30 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
నిర్మల్ జిల్లాలో నిర్ణేతలుగా మళ్లీ మహిళా ఓటర్లు
నిర్మల్ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 121 గ్రామపంచాయతీల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏడు మండలాల్లో 1,65,919 మంది ఓటర్లు ఉండగా 1,37,162 మంది ఓటు వేశారు. వీరిలో మహిళా ఓటర్లు 88,415 మందిలో 76, 252 మంది, పురుషుల 77,501 మంది ఉంటే 60,909 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తంగా 82.67 శాతం పోలింగ్ నమోదైంది. పురుషుల కన్నా దాదాపు16 వేల మంది మహిళలు అధికంగా ఓటు వేసి అభ్యర్థుల గెలుపును శాసించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. సారంగాపూర్, సోన్, కుంటాల, దిలావర్పూర్, నర్సాపూర్ (జి), నిర్మల్ రూరల్ మండలాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
ప్రశాంతంగా పోలింగ్
ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8 మండలాల్లో 156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పలు కేంద్రాలను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లలోపు పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. మొత్తం 1,32,438 ఓట్లకు గాను 1,14,802 ఓట్లు నమోదయ్యాయి. 86.68 పోలింగ్ శాతం నమోదు కాగా..అత్యధికంగా బోరజ్ లో 89.27 శాతం నమోదైంది.
ఆసిఫాబాద్జిల్లా..
మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం
బెజ్జూర్ 23734 19,866 83.70
చింతలమానేపల్లి 23955 20888 87.20
దహెగాం 22092 19980 90.44
కౌటల 27357 23238 84.94
పెంచికల్ పేట్ 12302 11104 90.26
సిర్పూర్(టి) 21838 18657 85.43
మొత్తం ఓట్లు 1,31,278 1,13 ,733 86.64
మంచిర్యాల జిల్లా..
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
బెల్లంపల్లి 23,464 20,015 85,30
భీమిని 11,529 10,363 89,90
కన్నెపల్లి 14,781 13,357 90.37
కాసిపేట 25,399 19,998 78.74
నెన్నెల 19,371 17,255 89,08
తాండూరు 27,757 21,794 78.52
వేమనపల్లి 15,081 13,422 89.00
మొత్తం 1,37,382 1,16,205 84.59
నిర్మల్ జిల్లా..
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
సారంగాపూర్ 37,092 30,299 81.69
నిర్మల్ రూరల్ 22,475 18,324 81.53
లోకేశ్వరం 27,384 23,363 85.32
దిలావర్పూర్ 18,744 15,488 82.63
కుంటాల 19055 16,217 85.11
నర్సాపూర్ (జి) 20,238 16,187 79.98
సోన్ 20,931 17,284 82.58
మొత్తం 1,65,919 1,37, 162 82.67
ఆదిలాబాద్జిల్లా
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
ఆదిలాబాద్ (రూరల్) 26,925 23,393 86.88
బేల 27,071 22,970 84.85
భీంపూర్ 17,831 15,135 84.88
బోరజ్ 14,414 12,868 89.27
జైనథ్ 19,035 16,791 88.21
మావల 4386 3700 84.36
సాత్నాల 9896 8685 87.76
తాంసి 12,880 11,260 87.42
మొత్తం 1,32,438 114802 86.68
