భారీగా పెరిగిన మనీ లాండరింగ్ కేసుల సంఖ్య

భారీగా పెరిగిన మనీ లాండరింగ్ కేసుల సంఖ్య
  • 313 మంది అరెస్టు
  • రూ.67 వేల కోట్లు స్వాధీనం
  • సుప్రీంకు కేంద్రం వెల్లడి

పీఎంఎల్​ఏ చట్టం వచ్చి 20 ఏళ్లయినా.....గత అయిదేళ్లలోనే రిజిస్టరవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ చట్టం ద్వారా నేరస్తుల పనిపడుతున్నామని, వారు దోచుకున్న సొమ్మును కక్కిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ చట్టం పేరుతో ఎవరినీ కావాలని ఇబ్బందిపెట్టడం లేదని, నిందితులకు ఎన్నో రక్షణలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకే ఈ చట్టం కింద కేసుల సంఖ్య తక్కువని పేర్కొంది. బెయిల్​ కండిషన్లు కఠినంగా ఉండటంతోపాటు, అరెస్టుకు కారణాలు చెప్పడం లేదని, ఎఫ్ఐఆర్​కు సమానమైన ఈసీఐఆర్​ (ఎన్​ఫోర్స్​మెంట్​ కేస్​ ఇన్ఫర్మేషన్​ రిపోర్టు) ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారని నిందితుల తరఫు లాయర్లు వాదిస్తున్నారు.

న్యూఢిల్లీ: ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దేశంలో మొత్తం 4,700 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టులో వెల్లడించింది. ఈ ప్రివెన్షన్​ ఆఫ్​ మనీ లాండరింగ్​ యాక్ట్​ (పీఎంఎల్​ఏ)  కేసులలో కేవలం 313 మందినే అరెస్టు చేశారని తెలిపింది. ఇంటరిమ్​ ఆర్డర్లతో ఆయా కేసులలో మొత్తం రూ. 67,000 కోట్ల మొత్తాన్ని ఈడీ స్వాధీనం చేసుకుందని పేర్కొంది. విజయ్​ మల్యా, మెహుల్​ ఛోక్సీ, నీరవ్​ మోడీ కేసుల్లో కోర్టుల ఆదేశాల ప్రకారం రూ. 18 వేల కోట్ల ఆస్తులను  ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ)​ స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఆయా బ్యాంకులకు అందచేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆస్తుల స్వాధీనం ప్రొసీజర్​ ప్రకారమే జరిగిందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా సుప్రీం కోర్టు బెంచ్​కు తెలిపారు. కావాలని ఎవరినీ వేధించడం లేదని, ఆధారాలు ఉంటే కఠినంగా వ్యవహరిస్తున్నామని సుప్రీం కోర్టు జస్టిస్​ ఏ ఎం ఖాన్విల్కర్​ బెంచ్​ ముందు ఒక కేసు విచారణ సందర్భంగా  కేంద్రం వెల్లడించింది.   

2021 లో సగటున 981 కేసులు
పీఎంఎల్​ఏ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి మొత్తం 4,700 కేసులపై ఈడీ దర్యాప్తు చేపట్టిందని ప్రభుత్వం పేర్కొంది. గత అయిదేళ్లలో  ఈడీ దర్యాప్తు  చేపడుతున్న కేసుల సంఖ్య సగటు పెరుగుతోందని, 2015–-16లో  కేసుల సగటు 111 గా ఉందని, 2020–-21 నాటికి ఈ సగటు 981 కేసులకు పెరిగిందని మెహతా కోర్టుకు తెలిపారు. నేరాలపై పనిష్మెంట్​ కోసమే కాకుండా, వాటిని నిరోధించేలా ఈ  పీఎంఎల్​ఏను ప్రభుత్వం తెచ్చిందని వివరించారు. 2002లో పీఎంఎల్​ఏ చట్టం వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటిదాకా 313 అరెస్టులు మాత్రమే జరిగాయని తుషార్​ మెహతా చెప్పారు. అంటే 20 ఏళ్లలో కేవలం 313 అరెస్టులేనని పేర్కొన్నారు. పీఎంఎల్​ఏ చట్టం కింద చాలా తక్కువ కేసులను మాత్రమే దర్యాప్తుకు అనుమతిస్తారని దీంతో అర్ధమవుతోందని సొలిసిటర్​ జనరల్​ సుప్రీం కోర్టు బెంచ్​కు తెలిపారు. యూకే, అమెరికా, చైనా, హాంకాంగ్​, బెల్జియం, రష్యా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో పీఎంఎల్​ఏ  కేసుల రిజిస్ట్రేషన్​ చాలా తక్కువని చెప్పారు. దేశంలోని పౌరుల స్వేచ్ఛను ఎక్కడా హరించేలా వ్యవహరించడం లేదని  తుషార్​ మెహతా అపెక్స్ కోర్టుకు వివరించారు. 20 ఏళ్లలో 313 అరెస్టులే జరిగినా, తమ పరిధిలో మరో 200 రిక్వెస్టులు ఉన్నాయని సుప్రీం కోర్టు బెంచ్ ఈ సందర్భంగా​ వెల్లడించింది.

కావాలనే కేసులు వేస్తున్నరు..
పీఎంఎల్​ఏ చట్టం కింద వ్యక్తులపై బలవంతపు చర్యలూ తీసుకోవడం లేదని,  మనీ లాండరింగ్​కు పాల్పడి  దేశం వదలి పారిపోయిన కొంత మంది  ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కేసులు వేస్తున్నారని మెహతా  చెప్పారు. ఆయా దేశాల నుంచి వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. 2016-–2021 మధ్యలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కొత్తగా 2,086 కేసులలో దర్యాప్తు మొదలెట్టిందని తుషార్​ మెహతా కోర్టుకు వెల్లడించారు. దేశం మొత్తం మీద గత అయిదేళ్లలో 33 లక్షల అఫెన్సెస్​ రిజిస్టరయితే, అందులో 2,086 కేసులను మాత్రమే దర్యాప్తుకు ఈడీ తీసుకుందని వివరించారు. ఈడీ దర్యాప్తు సాగుతున్న కేసుల సంఖ్య 2,086  కాదని, ఆ కేసుల సంఖ్య 2,186 అని బెంచ్​ ఈ సమయంలో వ్యాఖ్యానించింది. వివాదస్పద ట్రాన్సాక్షన్ల రిపోర్టింగ్​కు దేశంలో తగిన సిస్టమ్​ ఉందని, అధికార దుర్వినియోగం జరగకుండా తగిన రక్షణ కూడా ఉందని సొలిసిటర్​ జనరల్​ సుప్రీం కోర్టు బెంచ్​కు చెప్పారు. దేశంలో అవినీతి వల్లే నేరాలు, మనీలాండరింగ్​ ఎక్కువవుతున్నాయని మెహతా పేర్కొన్నారు. గ్లోబల్​ యాంటి-మనీలాండరింగ్​ నెట్​వర్క్​లో మన దేశం కూడా భాగస్వామని ,  మనీలాండరింగ్​ చట్టాలను తేవడంలో నెట్​వర్క్​లోని దేశాలు ఒకదానికొకటి సహకరించుకుంటాయని వివరించారు. మనీ లాండరింగ్​ విషయంలో దేశం కఠినంగా ఉండాల్సిందేనని, గ్లోబల్​ కమ్యూనిటీ మన నుంచి ఇదే కోరుకుంటోందని మెహతా చెప్పారు.   కేసుల విచారణలో ఈడీ చాలా వేగంగా ఉండాలని ఇటీవల ఒక కేసు విచారణలో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.