చర్చలు సఫలం.. హైదరాబాద్లో.. ఇంటర్నెట్, కేబుల్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం

చర్చలు సఫలం.. హైదరాబాద్లో.. ఇంటర్నెట్, కేబుల్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం

హైదరాబాద్: TG SPDCL సీఎండీతో కేబుల్ ఆపరేటర్ల చర్చలు సఫలం అయ్యాయి. ఇంటర్నెట్, కేబుల్ వైర్లను కట్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ ఇంటర్నెట్ ప్రొవైడర్ ప్రెసిడెంట్ సతీష్‌ బాబు చర్చల అనంతరం మీడియాకు వెల్లడించారు. రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కరెంట్​స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించడంతో ఎక్కడికక్కడ కేబుల్ వైర్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో కేబుల్ వైర్లను తొలగించడంతో ఇంటర్నెట్ కనెక్షన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జియో, ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు ఉన్నట్టుండి ఇంటర్నెట్ బంద్ అయింది. ఈ పరిణామంతో ఇంటర్నెట్ బంద్ అయిందని, పునరుద్ధరించాలని వేల సంఖ్యలో ఎయిర్ టెల్, జియో బ్రాడ్ బ్యాండ్ విభాగానికి ఫిర్యాదులు అందాయి.

ALSO READ : హైవే పక్కన రెస్టారెంట్ నడపాలంటే లంచం ఇవ్వాలా..?

కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్ సిటీలోని TG SPDCL ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI) కూడా అకస్మాత్తుగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను కట్ తొలగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం.. TG SPDCL సీఎండీతో కేబుల్ ఆపరేటర్లు చర్చలు జరిపారు.

చర్చలు సఫలం కావడంతో ఇకపై హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ వైర్లను కట్ చేయకూడదని TG SPDCL నిర్ణయించింది. అయితే.. ఆ కేబుల్, ఇంటర్నెట్ వైర్లపై ఆపరేటర్లకు కీలక సూచనలు చేసింది. విద్యుత్ స్తంభాలపై నిరుపయోగంగా పడి ఉన్న కేబుల్ వైర్లను స్వచ్ఛందంగా తొలగించి గణేష్ విగ్రహాల తరలింపునకు ఆటంకం కలగకుండా చూడాలని కేబుల్ ఆపరేటర్లకు స్పష్టం చేసింది.