
దాదాపు రెండు నెలల కిందట బైక్ టాక్సీ సేవలను కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. టూవీలర్లను వైట్ నంబర్ ప్లేట్ల కింద కమర్షియల్ వినియోగానికి కుదరదంటూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 21, 2025 నుంచి ర్యాపిడో, ఉబెర్ సంస్థలు మాత్రం బైక్ రెయిడింగ్ సేవలను తిరిగి స్టార్ట్ చేసినట్లు మనీకంట్రోల్ నివేదించింది. పైగా బుక్కింగ్స్ అంగీకరిస్తున్న విషయంపై అధికారికంగా రెండు సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఓలా మాత్రం ఇప్పటి వరకు సేవలను రద్దులోనే కొనసాగిస్తోంది.
దీనిపై కర్ణాటక రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పందిస్తూ హైకోర్టు తమకు బైక్ టాక్సీ పాలసీ రూపకల్పనకు నెల రోజులు గడువు ఇచ్చిందని.. అలా అని సేవలను తిరిగి ప్రారంభించటానికి కంపెనీలకు అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఈ విషయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకెళతామని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను మీరి వ్యాపార సంస్థలు ప్రవర్తించటంపై ఎలా ముందుకెళ్లాలనే విషయం గురించి రవాణా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ALSO READ : 12 శాతం.. 28 శాతం జీఎస్టీ స్లాబ్స్ రద్దు..
వాస్తవానికి జూన్ 16, 2025న బైక్ టాక్సీ సేవలను కర్ణాటకలో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నిషేధించినందుకు తీవ్రంగా విమర్శించిన ఒక రోజు తర్వాత బైక్ టాక్సీ సేవలను తిరిగి ప్రారంభించాయి ఉబెర్, ర్యాపిడోలు. ఈ తరహా రవాణా విధానాన్ని నిషేధించడానికి బదులుగా ఎందుకు నియంత్రించలేరని ప్రశ్నించింది ప్రధాన న్యాయమూర్తి విభు బఖ్రు, న్యాయమూర్తి సిఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్.
వాస్తవానికి 2021లో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. కానీ ఆటోరిక్షా డ్రైవర్ల సంఘాల ఒత్తిడితో ప్రభుత్వం మార్చి 2024లో ఆ పాలసీని ఉపసంహరించుకుంది. అలాగే జూలై 1న జారీ చేయబడిన కేంద్రం మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు, 2025 - రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ప్రయాణీకుల ప్రయాణాలకు రవాణాయేతర ప్రైవేటు మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతిస్తున్నప్పటికీ, ఆటో టాక్సీ యూనియన్ల వ్యతిరేకత కారణంగా కర్ణాటక బైక్ టాక్సీలను అనుమతించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని వెల్లడైంది. అయితే ప్రస్తుతం పట్టణాల్లో ప్రయాణాలకు బైక్ టాక్సీల ఆవస్యకతను కోర్టు పరిగణలోకి తీసుకోవటంపై బైక్ టాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి వాదనలను కోర్టు సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది.