
భారత క్రికెట్ లో గిల్ వేగంగా దూసుకెళ్తున్నాడు. కోహ్లీ తర్వాత ఈ యువ బ్యాటర్ శకం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా గిల్ అద్భుతంగా రాణించాడు. ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఆసియా కప్ టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ప్రకటించడంతో ఏడాది తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఓ వైపు టెస్ట్ క్రికెట్ లో తొలి సిరీస్ లోనే సత్తా చాటడం.. వన్డేల్లో దాదాపు 60 యావరేజ్ తో టాప్ బ్యాటర్ గా దూసుకెళ్లడం.. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ కు వైస్ కెప్టెన్ కావడం ఒక్కసారిగా గిల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.
ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్ లు ఆడుతున్న లిస్ట్ చూస్తే వారిలో ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాగా.. మరొకరు టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్. అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ యత్నము విదేశీ టెస్టులకు ఎంపిక చేయరు. అన్ని ఫార్మాట్ లు ఆడడం గిల్ కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఇదిలా ఉంటే ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగుతుంది. స్థాయికి తగ్గట్టుగా ఆడితే ఇండియా ఫైనల్ కు రావడం చాలా ఈజీ. ప్రస్తుతం భారత జట్టును ఓడించే ఆసియా దేశం లేనట్టే కనిపిస్తోంది. అయితే ఆసియా కప్ తర్వాత భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది.
అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఇండియాలో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆసియా కప్ కు విండీస్ తో సిరీస్ కు మధ్య కేవలం మూడు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. గిల్ టెస్ట్ జట్టుకు కెప్టెన్ కావడంతో ఖచ్చితంగా సిరీస్ ఆడాలి. బుమ్రా ఆసియా కప్ ఆడినా ఆ తర్వాత జరగబోయే వెస్టిండీస్ సిరీస్ కు పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని రెస్ట్ ఇవ్వనున్నారు. కానీ గిల్ కు మాత్రం ఆ అవకాశం లేదు. సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ ఆడితే 29న దుబాయి నుంచి భారత జట్టు ఇండియాకు వస్తుంది. 30న అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. అక్టోబర్ 1న టెస్ట్ సిరీస్ కు సిద్ధమవ్వాలి.
అక్టోబర్ 2 న తొలి టెస్ట్ ఆడాలి. అంటే గిల్ కు కనీసం ఇంటి దగ్గర ఒక్క రోజు కూడా ఉండే ఛాన్స్ లేదు. వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. జడేజా, సుందర్, కుల్దీప్ యాదవ్ ఉండడంతో టీ20 జట్టులో ఉన్న అక్షర్ పటేల్ ను టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయకపోవచ్చు. మొత్తానికి బుమ్రా, అక్షర్ పటేల్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా గిల్ మాత్రం ఖచ్చితంగా ఆడాలి.