తిరుమల శ్రీవారికి రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారం విరాళం : సీఎం చంద్రబాబు బయటపెట్టిన రహస్యం

తిరుమల శ్రీవారికి రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారం విరాళం : సీఎం చంద్రబాబు బయటపెట్టిన రహస్యం

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు ఇస్తుంటారు. నగదు, బంగారు, వెండి రూపంలో ఎవరి స్తోమతకు తగినట్లు విరాళాలు స్వామివారికి సమర్పిస్తుంటారు భక్తులు. అయితే.. ఓ ఎన్నారై భక్తుడి విరాళం గురించి సీఎం చంద్రబాబు బయటపెట్టిన రహస్యం సంచలనంగా మారింది. ఓ అజ్ఞాత ఎన్నారై భక్తుడు దేవదేవుడికి ఏకంగా 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తనతో చెప్పాడని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అన్నారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడం  హాట్ టాపిక్ గా మారింది.

మంగళవారం ( ఆగస్టు 19 ) మంగళగిరిలో జరిగిన P4 కార్యక్రమంలో ఈమేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. తనకు బాగా తెలిసిన ఒక భక్తుడు ఉన్నారని... ఆయన కంపెనీ పెట్టాలని అనుకోని ఎంతో కస్టపడి స్థాపించారని.. కంపెనీ లాభాల్లో నడుస్తున్న సమయంలో 60శాతం వాటా అమ్మారని అన్నారు. దీని ద్వారా ఆయనకు 1.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 6 వేల కోట్లు ఉంటుందని అన్నారు సీఎం చంద్రబాబు.

ఈ సంపద అంతా తనకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల వచ్చిందని.. ఆయన విశ్వసించారని అన్నారు చంద్రబాబు. అందుకే స్వామివారికి తిరిగి కృతజ్ఞతగా ఏదైనా సమర్పించుకోవాలని భావించారని అన్నారు. ఈ క్రమంలో 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారని అన్నారు చంద్రబాబు. దీని మొత్తం విలువ రూ. 150 కోట్లు ఉంటుందని అన్నారు. ఆ అజ్ఞాత భక్తుడు తన పేరు ఎక్కడా బయటపెట్టొద్దని ఓ లేఖ ద్వారా కోరారని తెలిపారు చంద్రబాబు.

తిరుమలలో స్వామివారికి రోజూ 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారని.. ఇప్పుడు యాదృచ్చికంగా అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారం సమర్పిస్తున్నారని అన్నారు చంద్రబాబు. ఈ విషయం అజ్ఞాత భక్తుడికి కూడా తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. ఒకే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో విరాళం సమర్పిస్తున్నారంటే..ఆయనకు దేవుడిపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని అన్నారు సీఎం చంద్రబాబు.

చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. సదరు అజ్ఞాత భక్తుడు ఎవరై ఉంటారా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వచ్చిన లాభాన్ని తన స్వార్దానికి వాడుకోకుండా దేవుడికి విరాళం ఇస్తున్నారంటే ఆ వ్యాపారవేత్త భక్తికి హ్యాట్సాఫ్ అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి, ఆ అజ్ఞాత భక్తుడు ఎవరు..?, అతను ఏ ప్రాంతానికి చెందినవాడు వంటి వివరాలు ఎప్పుడు తెలుస్తాయి చూడాలి.