
గురువారం ( ఆగస్టు 21 ) కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన వ్యక్తి అని.. ఆయనతో రాజ్యాంగపరమైన ఉపయోగాలు ఉంటాయనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించామని అన్నారు. ఈ ఎన్నికతో బీఆర్ఎస్ బీజేపీ వెంబడి ఉంటుందా లేదా అన్నది తెలుస్తుందని.. సెప్టెంబర్ 9న బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని అన్నారు పొన్నం.
యూరియా అనేది కేంద్ర అధీనంలో ఉంటుందని.. తెలంగాణను వివక్షపూరితంగా బద్నాం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు. తెలంగాణలో అనేక సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నా.. బద్నాం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మంత్రి పొన్నం. బీఆర్ఎస్, బీజేపి లు కలిసి కృత్రిమ యూరియా కొరత సృష్టించి రాక్షసానందం పొందుతున్నాయని అన్నారు.
ALSO READ : అకాల వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది..
ఆంధ్రప్రదేశ్ కి అధిక నిధులు ఇస్తే ఇక్కడి బిజేపి నాయకులు అడుగుతలేరని.. కాంగ్రెస్ ఎంపీలు కలిసి నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసారని అన్నారు. యూరియా కొరత లేకుండా కేంద్ర మంత్రి బండిసంజయ్ చొరవ తీసుకోవాలని... బాధ్యత వహించాలని కోరారు మంత్రి పొన్నం. సంవత్సరానికి వచ్చే యూరియాలో అరవై శాతం మాత్రమే వచ్చిందని.. రైతులని కావాలనే పక్కదోవ పట్టించేందుకు పక్కాగా బిజెపి బిఆర్ఎస్ ప్లాన్ చేశాయని అన్నారు. యూరియా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బీజేపీ రాజకీయం చేస్తోందని అన్నారు మంత్రి పొన్నం.
యూరియా కొరత విషయంలో బీఆర్ఎస్ మీడియా తమకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటోందని అన్నారు. రైతులను రెచ్చగొట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని.. క్యూ లైన్లు లేకున్నా చెప్పులు పెట్టించి ఫోటోలు, వీడియోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. రైతులు అధైర్య పడకండా ఉండాలని.. కేంద్రంతో మాట్లాడి సరిపడా యూరియా ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు పొన్నం.