5 నిమిషాల్లో ఆటో ఆఫర్ పై ర్యాపిడోకు ఫైన్.. కస్టమర్లకు క్యాష్ రీఫండ్ ఆదేశం..

5 నిమిషాల్లో ఆటో ఆఫర్ పై ర్యాపిడోకు ఫైన్.. కస్టమర్లకు క్యాష్ రీఫండ్ ఆదేశం..

దేశంలో టూవీలర్ మెుబిలిటీ రంగంలో ర్యాపిడో అతిపెద్ద సంస్థగా ఎదిగింది. ఈ క్రమంలో యూజర్లను తమ ఫ్లాట్ ఫారం ఉపయోగించేందుకు అనేక యాడ్ క్యాంపెయిన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 5 నిమిషాల్లో ఆర్డర్ చేయగానే ఆటో మీ ముందు ఉంటుంది లేదంటే రూ.50 రీఫండ్ ఇస్తాం అంటూ చేసిన ఒక ప్రకటనపై భారీగా యూజర్ల నుంచి కంప్లెయింట్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తాజాగా ర్యాపిడో సంస్థపై రూ.10 లక్షలు జరిమానా విధించింది. 

ప్రజలకు వేగవంతమైన ఖచ్చితమైన సేవలు అందిస్తామంటూ ఈ యాడ్ ద్వారా ర్యాపిడో భావన కలిగించిందని కానీ దానిని నిలబెట్టుకోవటంలో విఫలమైందని రెగ్యులేటరీ గుర్తించింది. అలాగే యాడ్ లో ప్రామిస్ చేసినట్లుగా రూ.50 ర్యాపిడో డబ్బు రూపంలో కాకుండా కాయిన్స్ ఇచ్చిందని, అది కూడా వారంలో వాడుకోకపోతే ఎక్స్ పెయిరీ అయ్యేలా బైక్ రైడ్స్ కోసం మాత్రమే అందించిందని దర్యాప్తులో గుర్తించబడింది. 

ALSO READ : హైవే పక్కన రెస్టారెంట్ నడపాలంటే లంచం ఇవ్వాలా..

ఏడాదిన్నర పాటు నిర్వహించిన ఈ యాడ్ 120 కంటే ఎక్కువ నగరాల్లో ప్రజలకు అందించింది ర్యాపిడో. దీనిపై జూన్  2024 నుంచి జూలై 2025 వరకు 1200 కంటే ఎక్కువ ఫిర్యాదులు రావటంతో సగం కూడా పరిష్కరించలేదు ర్యాపిడో. అయితే ప్రజలకు యాడ్ లో చెప్పినట్లుగా క్యాష్ బ్యాక్ అందించలేదని వారిని తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టిందని కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గుర్తించింది. 

తాజాగా దీనిపై తీర్పు వెలువరిస్తూ ర్యాపిడో సంస్థ ముందుగా యాడ్ ప్రాచారాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించింది. అలాగే కస్టమర్లకు రూ.50 క్యాష్ రీఫండ్ చెల్లించి దానికి సంబంధించిన రిపోర్ట్ 15 రోజుల్లో అందించాలని ఆదేశించింది.