
- ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభం..
- నాలుగు విడతల్లో వర్క్స్కంప్లీట్ చేసేలా ప్లాన్!
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.350కోట్లతో మాస్టర్ ప్లాన్‌రెడీ అయింది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం 2016లో బడ్జెట్లో రూ.100కోట్లు ప్రకటించి కాగితాలకే పరిమితం కాగా, మళ్లీ ఇప్పుడు ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, కల్యాణ తలంబ్రాలు తీసుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాడ వీధుల విస్తరణకు అవసరమయ్యే భూసేకరణకు నిధులు రూ.34.45కోట్లు రిలీజ్ చేశారు.
ఇప్పటికే 1.30 ఎకరాల భూమిని ఆలయం చుట్టూ సేకరించి సిద్ధం చేశారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ నేతృత్వంలో కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసి, ఇటీవలే భద్రాచలంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్థపతి, ఆర్కిటెక్లు, ఎండోమెంట్ ఇంజనీర్లు వైదిక కమిటీకి చేయబోయే అభివృద్ధి పనులు వివరించారు.
రూ.2,202.35 కోట్లలో భద్రాద్రికి రూ.350 కోట్లు..
తెలంగాణ రాష్ట్రంలోని పది పెద్ద దేవాలయాల డెవలప్మెంట్కు సర్కారు రూ.2,202.35కోట్లు కేటాయించింది. అందులోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.350కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేశారు. వైదిక కమిటీ నుంచి కొన్ని సూచనలు, సలహాలు స్వీకరించి అనంతరం అనుమతి ఇవ్వనున్నారు. ప్రభుత్వం అనుమతి రాగానే పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
పనులు ఇలా..
మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులను నాలుగు విడతలుగా చేపట్టాలని భావిస్తున్నారు.
తొలివిడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాద విభాగం, అడ్మినిస్ట్రేషన్ భవనం లాంటి ఇతర పనులను రూ.115కోట్లతో చేపట్టనున్నారు.
రెండో విడతలో రూ.35కోట్లతో విస్తా కాంప్లెక్స్ విస్తరణ,అడ్మిన్ బ్లాక్, ఘాట్లు,ఆలయ పరిరాల్లో రహదారులు నిర్మించనున్నారు.
మూడో విడతలో గోదావరి కరకట్ట కింద భాగంలో కాపా రామలక్ష్మమ్మ పరిసరాల్లో రామాయణ మ్యూజియం, వాగ్గేయకారుడు తూము నర్సింహదాసు పేరిట ఆడిటోరియం, భక్తరామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కు రూ.100కోట్లతో నిర్మాణాలు జరుగుతాయి.
నాలుగో దశలో టెంపుల్, టౌన్ డెవలప్మెంట్లో భాగంగా రూ.100కోట్లతో హోటళ్లు, ట్రైబల్ మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణకు రూపకల్పనకు ప్లాన్ చేశారు.
భూసేకరణ పూర్తయ్యింది
రామాలయంలో అభివృద్ధి పనుల కోసం ఆలయానికి తూర్పు, పడమర, దక్షిణం దిక్కుల వైపు ఉన్న 43 ఇండ్లను తొలగించి 1.30ఎకరాల భూమిని సేకరించాం. మాస్టర్ ప్లాన్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో తయారు చేసి ప్రభుత్వానికి పంపినం. మార్పులు, చేర్పుల అనంతరం నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. నిధులు రాగానే పనులు మొదలవుతాయి. - దామోదర్‌రావు, ఈవో, సీతారామచంద్రస్వామి దేవస్థానం