కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ రెడీ.. జూన్ 15 నుంచి ఆలయ పునరుద్ధరణ పనులు

కాళేశ్వరం మాస్టర్  ప్లాన్  రెడీ.. జూన్ 15  నుంచి ఆలయ పునరుద్ధరణ పనులు

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ఆలయం మాస్టర్  ప్లాన్  రెడీ అయింది. బుధవారం నుంచి ఆలయ విస్తరణ పనులు మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం పంచ బ్రహ్మ హోమం చేపట్టారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి ప్రాయశ్చిత్త హోమాలు, కళాపకర్షణ(ఇప్పుడున్న ఆలయ కట్టడాలను తొలగించే పని) మొదలవుతుంది. 

అనంతరం ఆది ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసే బాలాలయంలో కలశాలను ప్రతిష్ఠిస్తారు. ఈవో ఆఫీసులో ఏర్పాటు చేసిన మీటింగ్​లో గ్రామస్తులు, భక్తులు, ఆఫీసర్లకు కాళేశ్వరం మాస్టర్  ప్లాన్ ను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్  హనుమంతరావు పవర్  పాయింట్  ప్రజెంటేషన్  ద్వారా వివరించారు. ఆలయ విస్తరణ పూర్తయ్యాక ఒకేసారి 25 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా ప్లాన్​ చేసినట్లు తెలిపారు. 

గోదావరి పుష్కరాల లోపు ఆలయ విస్తరణ పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు. ధార్మిక సలహాదారు గోవిందా హరి, ఈవో మహేశ్, లైబ్రరీ చైర్మన్  రాజబాబు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్  మోహన్ రెడ్డి, ఎక్స్  అఫీషియో మెంబర్  ఫణీంద్ర శర్మ పాల్గొన్నారు.