పిల్లల మూత్రంతో ఎర.. తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్

పిల్లల మూత్రంతో ఎర.. తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్

న్యూఢిల్లీ: ప్రజలపై దాడి చేసి చంపేస్తున్న తోడేళ్లను బంధించేందుకు ఉత్తరప్రదేశ్​ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. వాటిని పట్టుకునేందుకు పిల్లల మూత్రంతో తడిపిన ముదురు రంగుల టెడ్డీ బేర్ బొమ్మలను ఎరగా వేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ బొమ్మలను ఉంచిన ఉచ్చులను తోడేళ్ల ఆవాసాల దగ్గరలో, నదీ ఒడ్డుపొంటి ఉంచుతున్నామన్నారు. ఇప్పటివరకు ఈ ప్లాన్‎తో నాలుగు తోడేళ్లు చిక్కినట్లు తెలిపారు.

Also Read:-రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్

 గత జులై నుంచి బహ్రైచ్ ప్రాంతంలో తోడేళ్లు దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. గ్రామస్తులపై దాడి చేసి చంపేస్తున్నాయి. జులై 17 నుంచి ఆరు తోడేళ్ల గుంపు ఓ మహిళతో సహా ఆరుగురు చిన్నారుల ప్రాణాలు తీశాయి. ఈ ఆపరేషన్‎లో అందులో నాలుగింటిని అధికారులు బంధించారు. ఇంకో రెండు తోడేళ్ల కోసం వేట కొనసాగిస్తున్నారు.

డ్రోన్‎లతో ట్రాకింగ్.. 

తోడేళ్ల మూమెంట్‎ను థర్మల్ డ్రోన్‎ల ద్వారా ట్రాక్ చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జనాల్లోకి వచ్చే క్రమంలో పటాకులు కాల్చి వాటిని ఉచ్చులవైపు పరిగెత్తేలా చేస్తున్నామన్నారు. బ్రిటిషర్లు ఉన్నప్పుడు తోడేళ్లను నిర్మూలించేందుకు ప్రయత్నించినప్పటికీ అవి నదీ తీర ప్రాంతాల్లో మనుగడ కొనసాగించాయని వివరించారు.

‘‘తోడేళ్లు ఎప్పటికప్పుడు వాటి స్థావరాలను మారుస్తుంటాయి. సాధారణంగా అవి రాత్రిపూట వేటాడతాయి. ఉదయానికల్లా తిరిగి వాటి గుహల్లోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో వాటిని తప్పుదారి పట్టించి బోనులు, ఉచ్చుల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నం”అని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పక్షుల నుంచి పంటలను కాపాడుకునేందుకు దిష్టిబొమ్మలు పెట్టినట్లుగానే తోడేళ్లను ఆకర్షించేందుకు పిల్లలను తలపించేలా టెడ్డీబేర్ బొమ్మలను వినియోగిస్తున్నామని చెప్పారు.

మరో చిన్నారిని చంపిన తోడేళ్లు

ఓ పక్క ఈ ఆపరేషన్ కొనసాగుతుండగానే మూడు తోడేళ్ల గుంపు సోమవారం బహ్రైచ్‎లోని ఓ గ్రామం మీద పడి రెండేండ్ల చిన్నారి ప్రాణాలు తీశాయి. మరో ముగ్గురిపై దాడి చేయగా గాయాలపాలయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందంటున్నారు. గతంలో తోడేళ్లు ఊర్లలోకి వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అవి వచ్చినట్టు వీడియో ప్రూఫ్ చూపించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.