V6 News

మార్కెట్ ఒడిదుడుకుల్లో లాభాలు కావాలా..? అయితే ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వండి ఇన్వెస్టర్స్

మార్కెట్ ఒడిదుడుకుల్లో లాభాలు కావాలా..? అయితే ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వండి ఇన్వెస్టర్స్

2026 ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత ఇండెక్స్ రోజుకు 500 పాయింట్లకు పైగా స్వింగ్ అవుతూ ట్రేడర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లోబల్ హెడ్ లైన్స్, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు ఇంట్రాడే ట్రేడింగ్‌ను ఒక హై-స్టేక్స్ గేమ్‌గా మార్చేశాయి. ఇలాంటి అస్థిర మార్కెట్లలో మనుగడ సాగించడానికి ఒక క్రమబద్ధమైన వ్యూహం అవసరం.

ట్రేడింగ్ ప్రారంభానికి ముందే 10-15 నిమిషాల సమయాన్ని ప్రిపరేషన్ కోసం కేటాయించాలి ఇన్వెస్టర్లు. గ్లోబల్ మార్కెట్ పనితీరు, ముఖ్యంగా ముడి చమురు ధరలను గమనించాలి. వార్తలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. క్రూడ్ రేట్లు స్థిరంగానే ఉంటే పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్  డేటా ఆధారంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవల్స్‌ను గుర్తించాలి. మునుపటి రోజు గరిష్ట, కనిష్ట స్థాయిలు అస్థిర సమయాల్లో కీలకమైన రిఫరెన్స్ పాయింట్లుగా పనిచేస్తాయి.

మార్కెట్ వేగాన్ని సూచించే ఓలటాలిటీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇండియా విక్స్ సూచీ పెరుగుతున్నప్పుడు ఆప్షన్ ప్రీమియంలు పెరుగుతాయి. ఇది ఆప్షన్ బయర్లకు మంచి అవకాశం. అయితే విక్స్ తగ్గుతున్నప్పుడు ఇండెక్స్ కదిలినా ప్రీమియంలు పెరగవు. దీనినే ప్రీమియం డికే అంటారు. ఇలాంటి సమయాల్లో నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేయడం అంటే ఉచ్చులో పడటమేనని ట్రేడర్లు గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సరైన ఆప్షన్ ఎంపిక..
చాలామంది ట్రేడర్లు తక్కువ ధరలో వస్తున్నాయని అవుట్-ఆఫ్-ది-మనీ(OTM) ఆప్షన్లను కొంటుంటారు. ఇది పెద్ద పొరపాటు. ముఖ్యంగా ఓలటైల్ మార్కెట్లలో ఎట్-ది-మనీ(ATM) ఆప్షన్లనే ఎంచుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇవి ఇండెక్స్ కదలికలకు అనుగుణంగా వేగంగా కదులుతాయని చెబుతున్నారు. తక్కువ ధర కంటే నమ్మదగిన కదలికలే లాభాలను తెచ్చిపెడతాయని చెబుతున్నారు.

రిస్క్ మేనేజ్‌మెంట్..
ఎంతటి వ్యూహమున్నా కఠినమైన రిస్క్ మేనేజ్‌మెంట్ లేకపోతే పెట్టిన డబ్బు కరిగిపోతుంది. ట్రేడ్ ప్రారంభించడానికి ముందే స్టాప్ లాస్,  గరిష్ట నష్టాన్ని నిర్ణయించుకోవాలి ట్రేడర్లు. అస్థిర మార్కెట్లు తెలివైన వ్యూహాలకు లాభాల బహుమతిని అందిస్తాయి. కేవలం ఊహలతో చేసే ట్రేడ్లకు కాదు. డేటాను చదవడం, ఎంట్రీ ఎగ్జిట్ లెవల్స్ నిర్మించుకోవడం, క్రమశిక్షణతో పెట్టుబడిని కాపాడుకోవడమే ట్రేడర్ విజయరహస్యం. మార్కెట్ ఎప్పుడూ మరో అవకాశాన్ని ఇస్తుంది.. కానీ ఆ అవకాశం అందుకునేలా మనం మార్కెట్లో మిగిలి ఉండాలంటే సరైన ప్లానింగ్ క్రమశిక్షణ అత్యవసరం.