- వివరాలు వెల్లడించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్
జైపూర్ (భీమారం), వెలుగు : మండలంలోని కిష్టాపూర్ డీసీఎం ఎస్ సెంటర్ లో సాగులో లేని భూముల్లో వరి సాగు చేసినట్లు రికార్డులు సృష్టించి రూ 38.15 లక్షల వడ్ల స్కాంకు పాల్పడిన ఇద్దరు సూత్రదారులు డీసీఎం ఎస్ సెంటర్ ఇన్చార్జి మాదాసు రమేశ్, అతడికి సహకరించిన బోగె మల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జైపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్ వివరాలు వెల్లడించారు. ఈనెల 9న కిష్టాపూర్ డీసీఎం ఎస్ సెంటర్ లో 2024–-25 రబీ సీజన్ లో వడ్ల స్కాం జరిగిందని సెంటర్ ఇన్చార్జి మాదాసు రమేశ్, బోగె మల్లయ్య, కొండపర్తి ప్రభాకర్, కొండ వెంకటేశ్, కటుకూరి రమణారెడ్డి, అవునూరి రాకేశ్, మాదాసు లావణ్యపై జిల్లా సివిల్ సప్ల్లై మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం మండలంలోని టేకుమట్ల ఎక్స్ రోడ్డు వద్ద సెంటర్ ఇన్చార్జి మాదాసు రమేశ్, బోగె మల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు చేసిన స్కాంను ఒప్పుకున్నారు. దీంతో నిందితుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ప్రభాకర్, వెంకటేశ్, రమణారెడ్డి, రాకేశ్, లావణ్య పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
