ఈవీఎంలు, సోషల్ మీడియా లేకుండా.. బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు: రాహుల్ గాంధీ

ఈవీఎంలు,  సోషల్ మీడియా లేకుండా.. బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు: రాహుల్ గాంధీ
  • ఈ ఫీట్ కోసం ఎంపైర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నారు మోదీ 
  • లోక్ తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు 

ఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. 400 పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ఫీట్ సాధించేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోంది. 400 సీట్లు సాధించేందుకు ప్రధాని మోదీ ఎంపైర్లను కూడా ఎంచుకున్నారని రాహుల్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఇండియా కూటమి అగ్రనేతలు ఢిల్లీలో లోక్ తంత్ర బచావో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా , ప్రెస్ పై ఒత్తడి లేకుండా బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేరని అన్నారు. 

ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి , ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచ్ లు గెలవడాన్ని క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. రాబోయే లోక్ సభ ఎన్నిక లకు ముందు ప్రధాని మోదీ ఎంపైర్లను ఎంచుకున్నారు. మ్యాచ్ కు ముందే మా జట్టు ఆటగాళ్లను అరెస్ట్ చేశారు అని రాహుల్ అన్నారు. 

ఎన్నికలకు ముందుకు అతిపెద్ద ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలన్నీ మూసివేయించారు. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కో వాలని ముగ్గురు క్రోనీ క్యాపిటలిస్టులు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.