ఆ హైదరాబాద్ వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండండి : IPL జట్లకు బీసీసీఐ అలర్ట్..!

ఆ హైదరాబాద్ వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండండి : IPL జట్లకు బీసీసీఐ అలర్ట్..!

IPL 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా.. తెర వెనక ఐపీఎల్ జట్లను నయానా భయానా లొంగదీసుకోవటానికి హైదరాబాద్ కేంద్రంగా లాబీయింగ్ నడుస్తుంది.. హైదరాబాద్‎లోనే ఓ బడా వ్యాపారవేత్త ఈ IPL మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడా.. ఇవన్నీ అంటున్నది.. ఇలా భయపడుతున్నది ఎవరో కాదు.. బీసీసీఐ.

 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఐపీఎల్‎లోని అన్ని జట్లకు.. వారి మేనేజర్లకు.. కోచ్‎లకు.. ఆటగాళ్లకు, యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‎కు చెందిన వ్యాపారవేత్త ఇటీవల మరింత యాక్టివ్ అయ్యారని.. అతనికి క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన అనుభవం కూడా ఉందని హెచ్చరిస్తూ.. అతనికి దూరంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు.. బీసీసీఐ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.

ఐపీఎల్ ఎడిషన్ 18 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. మరో ఆఫ్ సీజన్ మిగిలి ఉంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫస్ట్ హాఫ్ సక్సెస్‎ఫుల్‎గా కంప్లీట్ అయ్యింది. ఓ వైపు పరుగుల వరద పారుతుండగా.. కొన్ని మ్యాచుల్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‎లను కూడా టర్న్ చేశారు. ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోన్న ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్  చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్వయంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ధృవీకరించడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‏కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు గుర్తించిన బీసీసీఐ.. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు, జట్టు మేనేజర్లు, కోచ్‎లు, ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. 

గతంలో క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్‎లు చేసిన అనుభవం ఆ వ్యాపారవేత్తకు ఉందని.. అతడికి పంటర్లు, బుకీలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ అప్రమత్తం చేసింది. అతడు మళ్లీ యాక్టివ్ అయ్యాడని.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు జట్టు యజమానులు, ఆటగాళ్లను కలిసేందుకు ట్రై చేస్తున్నాడని.. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిఫ్ట్‎లు ఎరగా వేస్తాడని.. కుటుంబ సభ్యులకు కూడా విలువైన గిఫ్టులు పంపి అతడి రొంపి లాగుతాడని హెచ్చరించింది. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. బుకీల వలలో చిక్కుకుని భవిష్యత్ పాడు చేసుకోవద్దని హెచ్చరించింది.