బ్లాక్​లో ఐపీఎల్ టికెట్లు.. రూ. 2 వేల టికెట్ 6 వేలకు..

బ్లాక్​లో ఐపీఎల్  టికెట్లు.. రూ. 2 వేల టికెట్ 6 వేలకు..
  • బ్లాక్​లో ఐపీఎల్  టికెట్ల విక్రయం
  • ఆన్​లైన్​లో పెట్టిన క్షణాల్లోనే 30 వేలకు పైగా టికెట్లు గాయబ్
  • రేటు పెంచి క్యాష్‌‌ చేసుకున్న నిర్వాహకులు
  • ఇయ్యాల ఉప్పల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌, ఆర్‌‌సీబీ మ్యాచ్‌‌

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్​ స్టేడియంలో సన్ రైజర్స్  హైదరాబాద్, రాయల్  చాలెంజర్స్​ బెంగళూరు మధ్య గురువారం జరిగే మ్యాచ్​ టికెట్లను బ్లాక్​లో అమ్ముకున్నారు. ఈ సీజన్‌‌లో హైదరాబాద్‌‌లో ఇదే చివరి మ్యాచ్  కావడంతో టికెట్లకు భారీగా డిమాండ్‌‌ నెలకొంది. దీంతో ఐపీఎల్  అభిమానుల అవకాశాన్ని నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. ఈ మ్యాచ్‌‌  టికెట్  రేట్లను సన్‌‌రైజర్స్‌‌, టికెటింగ్‌‌ పార్ట్‌‌నర్‌‌  పేటీఎం అధికారికంగానే పెంచాయి. సాధారణ టికెట్​పై రూ.500 పెంచాయి. గత శుక్రవారం ఆన్‌‌లైన్‌‌లో టికెట్లు ఉంచామని సన్‌‌రైజర్స్‌‌ ప్రకటించగా అన్ని కేటగిరీల్లోని 30 వేలకు పైగా టికెట్లు క్షణాల్లో  మాయం అయ్యాయి. ఎంత ట్రై చేసినా పేటీఎం యాప్‌‌లో టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్‌‌  చెబుతున్నారు.

టికెట్లన్నీ బ్లాక్‌‌  మార్కెట్‌‌కు తరలించారని అనుమానం వ్యక్తం చేశారు. టికెటింగ్‌‌  పార్ట్‌‌నర్‌‌ ఉద్యోగుల సాయంతో  కొంతమంది వందలు, వేల సంఖ్యలో టికెట్లు తీసుకొని వాటిని  బ్లాక్‌‌ మార్కెట్​లో డబుల్‌‌, ట్రిపుల్‌‌ రేట్లకు అమ్మారు. ‘‘మా వద్ద టికెట్లున్నాయి. ఇంత రేటు’’ అంటూ వాట్సప్‌‌  స్టేటస్‌‌లు, ట్విట్టర్‌‌లో పోస్టులు పెడుతూ అమ్మారు. రూ.1,500 టికెట్‌‌ను రూ.4 వేలకు, రూ.2 వేల టికెట్‌‌ను రూ.5 వేల నుంచి రూ.6 వేలకు బ్లాక్‌‌లో విక్రయించారు. మ్యాచ్‌‌కు టైమ్‌‌ దగ్గర పడుతున్న కొద్దీ రేట్లు పెంచారు. మ్యాచ్‌‌  రోజు రూ.రెండు వేల టికెట్  రూ.పది వేలు పలుకుతుందని అంటున్నారు. ఇలా టికెట్లను బ్లాక్‌‌ చేసి  పబ్లిక్‌‌గా అమ్ముతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.