మాతాశిశు మరణాలు మన దగ్గరే ఎక్కువ

మాతాశిశు మరణాలు మన దగ్గరే ఎక్కువ
  • ఇండియా తర్వాతి ప్లేస్ లో నైజీరియా, పాకిస్తాన్
  • యునైటెడ్ నేషన్స్ రిపోర్టు

కేప్​టౌన్: ప్రసూతి, నవజాత శిశు(మాతాశిశు) మరణాలు ఇండియాలోనే అత్యధికమని యునైటెడ్ నేషన్స్(యూఎన్) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మాతాశిశు మరణాలు ఉన్న టాప్10 దేశాల్లో ఇండియా ముందుందని యూఎన్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రెండ్రోజుల కింద దక్షిణాఫ్రికాలోని కేప్​టౌన్​లో ఇంటర్​నేషనల్ మెటర్నల్ న్యూబార్న్ హెల్త్ కాన్ఫరెన్స్2023 ప్రారంభమైంది. ఈ సందర్భంగా 2020–21 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మాతాశిశు మరణాలపై డబ్ల్యూహెచ్​వో, యునిసెఫ్, యూఎన్​ఎఫ్​సీఏలు అంచనా వేసిన రిపోర్టును యూఎన్ విడుదల చేసింది.

ముఖ్యంగా సబ్ సహారా ఆఫ్రికా, మధ్య దక్షిణాసియా ప్రాంతాల్లో అత్యధిక మరణాలు సంభవించాయని పేర్కొంది. అయితే ఈ మరణాలను తగ్గించేందుకు ఆయా దేశాలు 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పింది. 2020–21లో ప్రపంచంలో మొత్తం 45 లక్షల మరణాలు నమోదు కాగా.. వీటిలో ప్రసూతి(మాతృ) మరణాలు 2,90,000, నవజాత శిశువు మరణాలు 23 లక్షలు, గర్భస్థ శిశు మరణాలు 19 లక్షలు ఉన్నాయి. ఒక్క ఇండియాలోనే అత్యధికంగా 7,88,000 ప్రసూతి, గర్భస్థ శిశు, నవజాత శిశు మరణాలు సంభవించాయి. ఆ తర్వాతి వరుసలో నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా, బంగ్లాదేశ్, చైనాలో ప్రసూతి, గర్భస్థ శిశు, నవజాత శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. 

మరణాలు తగ్గించడంలో ప్రపంచ దేశాలు ఫెయిల్ 

గడిచిన పదేండ్లలో ప్రసూతి, నవజాత, గర్భస్థ శిశువుల మరణాలను తగ్గించడంలో ప్రపంచ దేశాలు ఫెయిల్ అయ్యాయని రిపోర్టు వెల్లడించింది. ప్రసూతికి వైద్యపరంగా పెట్టుబడులు తగ్గాయని, దీంతో గర్భిణులు, తల్లులు, శిశువుల మరణాలను తగ్గించడం ఊపందుకోలేదని తెలిపింది. 2000–2010 మధ్యకాలంలో మాత్రం మరణాల రేటు చాలావరకు కంట్రోల్ అయిందని తెలిపింది. ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని, ఈ పరిస్థితులు మారాలని యూఎన్ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో గర్భిణులు, అప్పుడే పుట్టిన బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ అన్షు బెనర్జీ అన్నారు. కరోనా కాలంలో ఇది మరింత పెరిగిందని చెప్పారు.చంటిబిడ్డలు, బాలింతలు మరణాలు తగ్గాలంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లను పెంచాలని, వాటి కోసం ఆయా దేశాలు పెట్టుబడులను పెంచాలని సూచించారు.