జనాల తీరు ఆందోళన కలిగిస్తోంది

జనాల తీరు ఆందోళన కలిగిస్తోంది

న్యూఢిల్లీ: కరోనా జాగ్రత్తల విషయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన పెంచేదిగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొవిడ్ జాగ్రత్తలను పాటించకుండా, మాస్కులు కట్టుకోకుండా జనాలు ప్రయాణాలు చేస్తూండటం ఆందోళనకరంగా ఉందన్నారు. వైరస్‌ ముప్పు తొలగేదాకా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్తర భారతంలోని పలు హిల్ స్టేషన్స్‌లో పర్యాటకులు మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటించకుండా తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మోడీ స్పందించారు. కరోనా రూల్స్ పాటించాలని ప్రజలను కోరారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన మీటింగ్‌‌లో కరోనా రూల్స్ గురించి మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేసులు తగ్గించడంపై ప్రత్యేక ద‌ృష్టి సారించాలని సీఎంలకు ప్రధాని సూచించారు. కొవిడ్ వేరియంట్‌లపై ఫోకస్ పెట్టాలని.. వీటి విషయంలో నిపుణుల సలహాలు, సూచనలను పాటించాలన్నారు. మార్కెట్లు, హిల్ స్టేషన్స్‌లో ప్రజలు మాస్కులు కట్టుకోకుండా తిరుగుతున్నారని, ఇది ఆందోళనను కలిగిస్తోందన్నారు. ప్రజలు కొవిడ్ రూల్స్ పాటించేలా చూడాలని సీఎంలను ఆదేశించారు.