జాబ్ పేరిట సైబర్ ​క్రిమినల్స్ ​మోసం..ఇంజినీరింగ్ ​స్టూడెంట్​ సూసైడ్

జాబ్ పేరిట సైబర్ ​క్రిమినల్స్ ​మోసం..ఇంజినీరింగ్ ​స్టూడెంట్​ సూసైడ్
  • ఫోన్​చేసి ఉద్యోగం ఇస్తామని ఆఫర్​
  •  ఫ్రెండ్​ దగ్గర అప్పు చేసి రూ.28 వేలు కట్టిన విద్యార్థిని 
  •  అప్పు చెల్లించకపోతే హాల్​టికెట్ ఆపుతామన్న హెచ్​వోడీ ? 
  •  మనస్తాపంతో ఆత్మహత్య 
  •  సూర్యాపేట జిల్లా కొత్తగూడెంలో విషాదం

మేళ్లచెరువు, వెలుగు : సాఫ్ట్​వేర్ ​జాబ్ ఇస్తామని, డబ్బులు కట్టాలని సైబర్​ క్రిమినల్స్​ ఓ ఇంజినీరింగ్ ​స్టూడెంట్​కు ఫోన్​ చేయగా ఆమె తన ఫ్రెండ్ ​దగ్గర అప్పు తీసుకుని కట్టింది. తర్వాత సైబర్ ​నేరగాళ్లు ఫోన్​ స్విచ్ఛాఫ్​ చేసుకోవడంతో మోసపోయానని తెలుసుకుంది. అప్పు సంగతి కాలేజీ వరకు వెళ్లడం, తీసుకున్న వాళ్లకు తిరిగి డబ్బులు కట్టకపోతే ఎగ్జామ్స్​కు హాల్​టికెట్​ఆపేస్తామని హెచ్చరించడంతో ఎటూ పాలుపోక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు, స్నేహితుల కథనం ప్రకారం..సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తగూడానికి చెందిన కర్లపూడి మౌనిక (22) కోదాడలోని అనురాగ్ ​కాలేజీలో ఇంజినీరింగ్​ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నెల కింద సైబర్​ క్రిమినల్స్​ మౌనిక కు ఫోన్​ చేశారు. 

తమది సాఫ్ట్​వేర్ ​కంపెనీ అని మంచి జాబ్ ఇస్తామని ఆఫర్​ఇచ్చారు. కంపెనీ రూల్స్​ ప్రకారం కొంత అడ్వాన్స్​ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.28 వేలు కడితే జాబ్​కన్ఫమ్​ చేస్తామని నమ్మబలికారు. దీంతో ఎక్కడ ఉద్యోగం చేజారిపోతుందోనని  అనుకున్న మౌనిక  ఫ్రెండ్​ క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు తీసుకుని పంపించింది. వెంటనే సైబర్​ క్రిమినల్స్​ ​ఫోన్  ​స్విచ్ఛాఫ్ ​చేసుకోవడంతో తాను మోసపోయానని గుర్తించింది. డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్​ నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో చెప్పకుండా ఇంకొందరి స్నేహితుల దగ్గర రూ.17వేలు తీసుకుని కట్టింది. మొదటి ఫ్రెండ్​ దగ్గర రూ.11 వేలు, మళ్లీ తీసుకున్న  రూ.17 వేలు కట్టే పరిస్థితి లేకుండా పోయింది. విషయం కాలేజీలో హెచ్​వోడీకి తెలియడంతో పిలిచి మాట్లాడినట్టు తెలిసింది. 

తీసుకున్న డబ్బులు వెంటనే కట్టాలని, లేకపోతే  ఎగ్జామ్స్​ హాల్​టికెట్ ఆపుతామని బెదిరించినట్టు సమాచారం. ఇదంతా ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భయపడిన మౌనిక గురువారం ఇంట్లో ఎవరూ లేని టైంలో పురుగుల మందు తాగింది. కొద్దిసేపటికి వచ్చిన కుటుంబసభ్యులు  ఆమెను మేళ్లచెర్వులోని ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి  కోదాడలోని మరో ​దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని  డాక్టర్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఉఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు.