
లైనప్‌లో నలుగురు స్టార్లు ఉన్నా.. తన నైపుణ్యాన్ని ఘనంగా చూపెట్టాడు..! బంగ్లా బౌలర్ల అనుభవలేమిని ఆసరాగా చేసుకుంటూ.. రెండో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు..! ఓపెనింగ్ కోసం పోటీ ఎక్కువగా ఉన్నా.. తన ఆటతో ప్లేస్ సుస్థిరం చేసుకున్నాడు..! మొత్తానికి పులుల బౌలింగ్‌లో పస లేదని నిరూపించిన మయాంక్ అగర్వాల్ (330 బంతుల్లో 28 ఫోర్లు, 8 సిక్సర్లతో 243).. ఫస్ట్ టెస్ట్‌లో పరుగుల షో చూపెట్టడంతో టీమిండియా మ్యాచ్‌పై పట్టు బిగించింది..! ఇక బంగ్లా ఓటమిని మూడో రోజే ఖరారు చేస్తుందా? లేక నాలుగో రోజుకు కొనసాగిస్తుందా? అన్నది తేలాల్సిఉంది..!!
ఇండోర్: ఫస్ట్ టెస్ట్ రెండో రోజు కూడా టీమిండియాదే ఆధిపత్యం. బౌలింగ్‌తో కోలుకోలేని దెబ్బకొట్టిన బంగ్లాదేశ్‌ను బ్యాట్స్‌మెన్ కూడా ఓ ఆటాడుకున్నారు. రోజంతా కష్టపడినా ఐదు వికెట్లు మాత్రమే ఇచ్చి కఠిన పరీక్ష పెట్టారు. ఫలితంగా శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 114 ఓవర్లలో 6 వికెట్లకు 493 పరుగులు చేసింది. జడేజా (60 బ్యాటింగ్), ఉమేశ్ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రహానె (172 బంతుల్లో 9 ఫోర్లతో 86), పుజారా (72 బంతుల్లో 9 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రహానెతో నాలుగో వికెట్‌కు 190 రన్స్ జోడించిన మయాంక్… జడేజాతో ఐదో వికెట్‌కు 23.5 ఓవర్లలోనే 123 పరుగులు జత చేయడం విశేషం. ప్రస్తుతం విరాట్‌సేన 343 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.
విరాట్ డకౌట్..
86/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియాను ఆరంభంలో అబు జాయేద్ (4/108) కొద్దిగా ఇబ్బందిపెట్టాడు. మయాంక్ నిలకడగా ఆడినా.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి షాకిచ్చాడు. 28వ ఓవర్ (జాయేద్)లో మెహిదీ హసన్ క్యాచ్ డ్రాప్‌తో గట్టెక్కిన పుజారా రెండు బౌండరీలతో 23వ హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ 30వ ఓవర్‌లో జాయేద్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ బాల్‌ను వెంటాడి థర్డ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 10 వేల మంది ప్రేక్షకుల కేరింతల మధ్య క్రీజులోకి వచ్చిన కోహ్లీ డకౌట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. జాయేద్ (32వ ఓవర్) వేసిన ఆఫ్ కట్టర్‌ను డిఫెన్స్ చేయబోయిన విరాట్ వికెట్ల ముందు దొరికాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చినా.. రివ్యూలో బంగ్లా సక్సెస్ అయ్యింది. కళ్ల ముందు రెండు వికెట్లు పడినా.. మయాంక్ అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో ఎబాదత్ (1/115), మెహిదీ హసన్ (1/125)ను దీటుగా ఎదుర్కొన్నాడు. ‘నటరాజ’ స్టైల్‌లో ఫుల్‌షాట్స్, ఆఫ్ స్పిన్‌లో ముందుకొచ్చి లాంగాన్‌లో సిక్సర్ కొట్టిన మయాంక్ 98 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను చేరాడు. రెండో ఎండ్‌లో రహానె కూడా మంచి టచ్‌లో కనిపించాడు. డిఫెన్స్‌కు ప్రాధాన్యమిస్తూనే చెత్త బాల్స్‌ను రోప్ దాటించాడు. మిడాఫ్ రీజియన్‌లో ఎక్కువ రన్స్ రాబట్టిన మయాంక్ 90ల్లోకి రావడం, రహానె కూడా వికెట్ పడకుండా చూడటంతో ఇండియా 188/3 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.
నో వికెట్..
ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లతోనే ఆడటం బంగ్లా కొంప ముంచింది. లంచ్ తర్వాత తొలి ఓవర్‌లోనే ఫోర్‌తో సెంచరీకి చేరువైన మయాంక్.. 60వ ఓవర్‌లో మరో బౌండరీతో ట్రిపుల్ డిజిట్ స్కోరు అందుకున్నాడు. విండీస్ టూర్ నుంచి ఫైన్ ఫామ్ చూపెడుతున్న రహానె తన అనుభవాన్ని రంగరిస్తూ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తాడు. దీంతో సింగిల్స్, డబుల్స్‌తో 21వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారీ టార్గెట్ నిర్దేశించాలన్న ఉద్దేశంతో మయాంక్ కూడా తైజుల్, మిరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టి 150 రన్స్ పూర్తి చేశాడు. ఈ దశలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్ ‘డబుల్ సెంచరీ’ చేయాలని రెండు వేళ్లతో చేసిన సంకేతాలు టీవీ కెమెరాల్లో రికార్డు కావడం అందర్ని ఆకట్టుకున్నాయి. అయితే బంగ్లా రెండో కొత్త బంతి తీసుకున్నా.. అగర్వాల్–రహానె జంటను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. దీంతో టీ వరకు ఇండియా 303/3 స్కోరు చేసింది.
‘డబుల్’ డబుల్
అప్పటివరకు నిలకడగా ఆడిన రహానె.. టీ తర్వాత రెండో ఓవర్‌లో ఏకాగ్రత కోల్పోయాడు. జాయేద్ వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌ను కట్ చేసిన రహానె.. డీప్ పాయింట్‌లో తైజుల్ చేతికి చిక్కాడు. ఈ దశలో వచ్చిన జడేజా చక్కని సహకారం అందించాడు. మెహిదీ హసన్ ఫ్లైట్ బాల్స్‌ను నేర్పుగా స్టాండ్స్‌లోకి పంపిన మయాంక్ ఇండియా లీడ్‌ను 200కు చేర్చాడు. అదే ఊపులో 196 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మరో సిక్సర్‌తో కెరీర్‌లో రెండో ‘డబుల్ సెంచరీ (303 బాల్స్)’ సాధించాడు. వెంటనే మయాంక్ డబుల్ చేశానని రెండు వేళ్లతో డ్రెస్సింగ్ రూమ్ వైపు సంకేతాలు చూపగానే.. కోహ్లీ మూడు వేళ్లతో ట్రిపుల్ కావాలని కోరడం చూడముచ్చటగా అనిపించింది. తర్వాత ఈ ఇద్దరు వన్డే తరహాలో ఫోర్లు, సిక్సర్లు బాదారు. అదే ఊపులో ట్రిపుల్ చేస్తాడనుకున్న మయాంక్ దూకుడుకు మిరాజ్ కళ్లెం వేశాడు. 108వ ఓవర్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన మయాంక్.. తర్వాతి బాల్‌ను కూడా అదే స్థాయిలో కొట్టాడు. కానీ డీప్ మిడ్‌వికెట్‌లో జాయేద్ క్యాచ్ పట్టాడు. సాహా (12) విఫలమైనా..ఉమేశ్ ఓ ఫోర్, మూడు సిక్సర్లతో రెచ్చిపోవడంతో ఇండియా స్కోరు 500కు చేరువైంది.