
న్యూఢిల్లీ: లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్‌కు మరోసారి వెన్ను గాయం తిరగబెట్టింది. దీంతో ఒక ఏడాదిలో మూడుసార్లు ఇదే గాయానికి గురికావడంతో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆరు నెలల కిందట వెన్ను నొప్పికి గురైన మయాంక్ సీవోఈలోని స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్ వద్ద చికిత్స తీసుకున్నాడు. ఇందులో భాగంగా అతని బౌలింగ్ స్పీడ్‌ను 15 కిలోమీటర్లకు తగ్గించి యాక్షన్‌ను రీ మోడలింగ్ చేశారు.
రిహాబిలిటేషన్ తర్వాత బరిలోకి దిగిన మయాంక్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి వంద రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. 30 మార్చి 2024 నుంచి 4 మే 2025 మధ్య కాలంలో మయాంక్ మొత్తం 9 టీ20లు ఆడాడు. ఈ క్రమంలో గతేడాది ఏప్రిల్‌లో వెన్ను గాయానికి గురైన మయాంక్ ఆరు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం జట్టులోకి వచ్చాడు. కానీ సిరీస్ ముగిసేలోపు మళ్లీ వెన్ను నొప్పి తిరగబెట్టింది. దీంతో సీవోఈలో రిహాబిలిటేషన్‌లో ఉండటం వల్ల డొమెస్టిక్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లో గాయపడ్డాడు. ‘సీవోఈలో ఫిజియోగా ఉన్న నితిన్ పటేల్ వెళ్లిపోయాడు.
ఇప్పుడు మయాంక్ పునరావాసం గురించి ఎవర్ని అడగాలో కూడా తెలియదు. అసలు గాయాన్ని పరిశీలించకుండానే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు. ఏడాదిలో మూడుసార్లు గాయం తిరగబెట్టిందంటే ఎలాంటి రిహాబిలిటేషన్ జరిగిందో వాళ్లకే తెలియాలి’ అని గతంలో ఎన్‌సీఏలో చేసిన స్త్రెంత్ అండ్ కండిషనింగ్ ట్రెయినర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఇక మయాంక్ ఐపీఎల్‌కు దూరం కావడంతో అతని ప్లేస్‌లో న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓ రూర్కేను తీసుకున్నారు.