అడ్మిషన్ల గైడ్‌‌లైన్స్‌‌ సవరించిన ఎంసీఐ

అడ్మిషన్ల గైడ్‌‌లైన్స్‌‌ సవరించిన ఎంసీఐ

మెడికల్‌‌ పీజీ స్టూడెంట్లకు జిల్లా హాస్పిటళ్లలోనూ ట్రైనింగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్‌‌ పీజీ స్టూడెంట్లు ఇకపై జిల్లా హాస్పిటళ్లలోనూ ట్రైనింగ్‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంసీఐ ఆధ్వర్యంలోని బోర్డ్‌‌ ఆఫ్‌‌ గవర్నెన్స్‌‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో ఎలాంటి వ్యాధులతో రోగులు హాస్పిటళ్లకు వస్తున్నారు, రోగం తీవ్రత ఎలా ఉందో మెడికోలకు అవగాహన వచ్చేలా ‘పోస్ట్ గ్రాడ్యుయేట్‌‌ మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ (సవరణ) రూల్స్–2020ని ఎంసీఐ రిలీజ్ చేసింది. ఈ ఏడాది మెడికల్‌‌ పీజీలో చేరే వారు 100 బెడ్స్ కు తగ్గకుండా ఉన్న జిల్లా హెడ్‌‌ క్వార్టర్స్‌‌ హాస్పిటల్‌‌లో తప్పనిసరిగా ట్రైనింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. కేంద్రం కొత్తగా డిస్ట్రిక్ట్‌‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌‌ పేరుతో ఈ విధానాన్ని తీసుకువస్తోందని కాళోజీ హెల్త్‌‌ వర్సిటీ వైస్‌‌ చాన్స్ లర్‌‌ డాక్టర్‌‌ కరుణారెడ్డి తెలిపారు. ఎండీ, ఎంఎస్‌‌ చేసే మెడికోలు తప్పనిసరిగా మూడు నెలలకోసారి రొటేషన్‌‌ పద్ధతిలో జిల్లా హాస్పిటళ్లలో పనిచేయాల్సి ఉంటుంది. వారి కోర్సుల్లో జిల్లా ‘రెసిడెన్సీ ప్రోగ్రామ్‌‌’ భాగంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎండీ, ఎంఎస్‌‌ చేసేవాళ్లు సంబంధిత మెడికల్‌‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌‌తో పాటు స్పెషలైజేషన్‌‌ ఆధారంగా దగ్గర్లోని హాస్పిటల్‌‌లో ట్రైనింగ్‌‌ చేసే వారు.

3, 4, 5 సెమిస్టర్లలో..

3, 4, 5 సెమిస్టర్లలో పీజీ స్టూడెంట్స్‌‌ జిల్లా హాస్పిటళ్లకు ట్రైనింగ్‌‌కు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా హాస్పిటళ్లలోనూ సూపర్‌‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ఈ విధానం కీలకంగా మారనుంది. జిల్లాలకు రెసిడెంట్లుగా వెళ్లిన వారు డిస్ట్రిక్ట్‌‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌‌ పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది. ఇన్‌‌ పేషంట్లు, ఔట్‌‌ పేషంట్లు, క్యాజువాలిటీ తదితర వార్డుల్లో సేవలందించాల్సి ఉంటుంది. అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్,  ఫోరెన్సిక్‌‌ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ,  ఫిజియాలజీ, ఫార్మకాలజీల్లో అడ్మిషన్‌‌ పొందిన పీజీ మెడికల్‌‌ స్టూడెంట్లు జిల్లా రెసిడెన్సీ ట్రైనింగ్‌‌లో పాల్గొనాల్సి ఉంటుంది.