పగలు ఇంజనీర్..  రాత్రయితే దొంగ: తోటి ఉద్యోగుల ఇళ్లకే కన్నం

పగలు ఇంజనీర్..  రాత్రయితే దొంగ: తోటి ఉద్యోగుల ఇళ్లకే కన్నం
  • 32.5 తులాల నగలు, బైక్​ స్వాధీనం

మందమర్రి, వెలుగు: మంచి జీతం… మెకానికల్​ఇంజనీర్​గా హోదా… అలాంటి వ్యక్తి జల్సాలకు అలవాటుపడడంతో దొంగగా మారాడు. మంచివాడిగా నటిస్తూ  తోటి ఉద్యోగుల ఇళ్లకే కన్నం వేసి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. కరీంనగర్​జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన తుమ్మల శ్రీకాంత్​మంచిర్యాల జిల్లా దేవాపూర్ లోని ఓరియంట్​ ​సిమెంట్ కంపెనీలో మెకానికల్​ఇంజనీర్ గా 2013లో ఉద్యోగంలో చేరాడు.తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ వారి ఇళ్లకు వెళ్లి పరిసరాలను గమనించేవాడు. వారు లేని సమయంలో రాత్రుళ్లు చోరీలు చేసేవాడు. అందరితో కలివిడిగా ఉండటంతో శ్రీకాంత్ పై ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు.  జీతం ఎక్కువగా వస్తుందని ఇటీవలే శ్రీకాంత్​ఏపీలోని వైజాగ్​జిల్లా గాజువాకలోని కంపెనీలో చేరాడు.

వాహనాల తనిఖీలో…

మందమర్రి సీఐ ఎడ్ల మహేశ్​ నేతృత్వంలో దేవాపూర్​ ఎస్సై దేవయ్య, కాసిపేట ఎస్సై భాస్కర్​రావు సోమగూడెం క్రాస్​రోడ్డు వద్ద శనివారం వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బైక్​పై వెళుతున్న శ్రీకాంత్ ను ఆపారు. గాజువాకలో మెకానికల్​ఇంజనీర్​గా చేస్తున్నానని, గతంలో ఓరియంట్​ సిమెంట్​ కంపెనీలో పనిచేసినట్లు పేర్కొన్నాడు. అయితే బైక్​ డాక్యుమెంట్లకు సంబంధించి సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో చేసిన చోరీలు బయటపడ్డాయి. ఓరియంట్​ సిమెంట్​ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు దెబ్బటి రాజయ్య, తోట శ్రీనివాస్​ఇండ్లలో 2018 సంవత్సరంలో దొంగలు రూ.5లక్షల విలువైన  32.5 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. 2016లో అవినాష్​ అనే ఉద్యోగి బైక్​చోరీకి గురైంది. మూడు చోరీలకు శ్రీకాంత్​ కారణమని డీసీపీ రక్షిత కె మూర్తి తెలిపారు. అతని నుంచి బంగారు నగలు, బైక్​స్వాధీనం చేసుకున్నారు.