పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధి మాఘ స్నానాలకు ముస్తాబైంది. మంజీరా పాయల మధ్యలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దాదాపు లక్షమంది పుణ్య స్నానాల కోసం వస్తా రని అధికారులు అంచనా వేశారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలు, చెక్ డ్యాం, అనకట్ట ప్రాంతాల్లో షవర్లతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి టెంపరరీ గదులను సిద్ధం చేశారు. ఆలయం ముందు భక్తుల కోసం వీఐపీ క్యూలైన్ తో పాటు సాధారణ క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీస్పీ,2 సీఐలు,15 మంది ఎస్ఐలు, 192 మంది కానిస్టేబుల్స్ బందోబస్తు నిర్వహించనున్నారు. 8 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు తాగునీటితో పాటు దేవాలయం తరుపున ఉచిత ప్రసాదం, బెల్లం అన్నం, పులిహోర పంపణీ చేస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో నాలుగుచోట్ల జాతరలు
సిద్దిపేట : మాఘ అమావాస్య సందర్భంగా సిద్దిపేట జిల్లాలో నాలుగుచోట్ల జాతరలు జరగనున్నాయి. కొమురవెల్లి మల్లికార్జున స్వామి మహాజాతరకు పట్నం వారంతో అంకురార్పణ జరగనున్నది. సిద్దిపేట మండలం పుల్లూరు బండపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి జాతర ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుంది. ఇక్కడ ఎప్పటికీ ఎండిపోని కోనేరు ఉంది. ఏటా మాఘ అమవాస్య నుంచి ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది. కోహెడ మండలం కూరెల్ల గ్రామ పరిధిలోని గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి జాతరను సింగరాయ జాతరగా పిలుస్తారు. తుమ్మెద వాగు పక్కన అటవీ ప్రాంతంలోని రాతి గుహలో స్వామివారు స్వయంభుగా వెలిశారు. గుట్ట పక్కనే ఉన్న మోయ తుమ్మెద వాగులో స్నానమాచరించి భక్తులు స్వామిని దర్శించుకుంటారు. మాఘ అమావాస్య రోజే జాతర జరుగుతుండడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు 3 కిలోమీటర్లు నడిచి వస్తారు.
దుబ్బాక మండలం రామేశ్వరంపల్లిలోని రామలింగశ్వర స్వామి జాతరకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తారు. కూడవెల్లి వాగు పక్కనే ఉండడంతో కూడవెల్లి జాతరగా ప్రసిద్ధి చెందింది. మాఘ అమావాస్య నుంచి ఐదు రోజులు జాతర జరుగుతుంది. ఏటా యాభై వేల పై చిలుకు మంది భక్తులు హాజరవుతారు. నంగునూరు మండలం పాలమాకుల పంచాయతీ పరిధిలోని గుబ్బటి గుట్టపై వెలిసిన దత్తాత్రేయ స్వామిని మాఘ అమావాస్య రోజున మాత్రమే దర్శించుకునే అవకాశం కలుగుతుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసి తిరిగి మరుసటి ఏడాది మాఘ అమావాస్య రోజే తెరవడం ఇక్కడి ప్రత్యేకత.
