- అర్ధరాత్రి 2 గంటలకు లేపి కట్టెలు, వైర్లతో ఇష్టమొచ్చినట్లు దాడి
- పిల్లవాడు ఏడుస్తున్నా 2 గంటలపాటు చిత్రహింసలు
- చిన్నారిని రోడ్డుపై విసిరికొట్టాడుమెదక్ జిల్లాలో దారుణం
మెదక్, వెలుగు: బాలల దినోత్సవం రోజు మెదక్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకును ఓ సవతి తండ్రి కనికరం లేకుండా గొడ్డును బాదినట్టు బాదాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ముత్యం శ్వేత, సత్యనారాయణ దంపతులు. శ్వేత మొదటి భర్త నుంచి విడిపోయి మేనబావ అయిన సత్యనారాయణను పెళ్లి చేసుకుంది. శ్వేతకు మొదటి భర్తతో పుట్టిన కొడుకు ఉండగా.. సత్యనారాయణను పెళ్లి చేసుకున్నాక కూతురు పుట్టింది.
మేస్త్రీ పనిచేసే సత్యనారాయణ గురువారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్య, సవతి కొడుకు వంశీ (4), కూతురు ఇంట్లో పడుకొని ఉండగా.. రాత్రి 2 గంటల టైంలో నిద్రపోతున్న వంశీని లేపాడు. గమనించిన తల్లి శ్వేత రోజు లాగే టాయిలెట్‌కు తీసుకెళ్తున్నాడేమో అనుకుంది. కానీ.. వంశీని సత్యనారాయణ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి షర్ట్ విప్పేశాడు. ఫోన్ చార్జింగ్ పెట్టే కేబుల్ వైర్ మెడకు వేసి లాక్కుపోయి కట్టెలు, బైండింగ్ వైర్ తో విచక్షణారహితంగా కొట్టాడు. బాలుడు ఏడుస్తున్నా వినిపించుకోకుండా రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారు జాము నాలుగు గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు బాలుడిని చిత్రహింసలు పెట్టాడు. అప్పటికీ కోపం చల్లారక వంశీని సీసీ రోడ్డుపైన ఎత్తి పడేశాడు. ఇంటి పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు. దీంతో వంశీ ఒళ్లంతా గాయాలతో పచ్చిపుండులా మారిపోయాడు.
చుట్టుపక్కల వారిని సైతం బెదిరించాడు
వంశీ ఏడుపు విని తల్లి శ్వేత నిద్రలేచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా సత్యనారాయణ ఇంటి తలుపులు మూసి తాళం వేశాడు. దీంతో ఆమె ఏమీ చేయలేక ఇంట్లోనే ఏడుస్తూ ఉండిపోయింది. బాలుడి ఏడుపు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు అక్కడికి చేరుకోగా సత్యనారాయణ వారిని సైతం బెదిరించాడు. తర్వాత అందరూ అతడిని నిలదీయడంతో ఇంటి తలుపులు తెరిచాడు. దీంతో శ్వేత తన అక్కకు ఫోన్ చేయగా ఆమె సూచన మేరకు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వంశీని మెదక్ పట్టణంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లింది.
తీవ్రంగా గాయపడ్డ బాలుడికి పీడియాట్రిషియన్ డాక్టర్ నరేశ్ ఎన్ఐసీలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. భర్త సత్యనారాయణతో తనకు, తన పిల్లలకు ప్రాణభయం ఉందని శ్వేత.. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తర్వాత మెదక్ టౌన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును రామాయంపేట్ పీఎస్ కు బదిలీ చేశారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని రామాయంపేట పీఎస్ ఎస్ఐ బాలరాజు తెలిపారు.
