సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తనిఖీలు... మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన

సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తనిఖీలు... మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన
  • రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య సేవల తనిఖీలు  

రామాయంపేట, వెలుగు:  వైద్యం ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ దంపతులు మెదక్ నుంచి రామాయంపేటకు సైకిల్ పై వెళ్లారు. అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, డెలివరీ, హాజరు రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య శాఖను బలోపేతం చేస్తూ పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. 

ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, ఇప్పటివరకు జిల్లాలో  మలేరియా కేసులు నమోదు కాలేదని, కొన్ని డెంగ్యూ కేసులు నమోదైనట్టు చెప్పారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేక తక్కువగా డెలివరీలు అవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని గైనకాలజిస్ట్ పోస్టు నియామకం చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా  చూస్తామని తెలిపారు.