
- అడ్డుకున్న పోలీసులు గేటు తోసుకుని వెళ్లిన గిరిజనులు
- మెదక్‌లో ఉద్రిక్తత
మెదక్, వెలుగు: అర్హులైన గిరిజనులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో సోమవారం లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మెదక్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సమితి జాతీయ అధ్యక్షుడు దాస్ రాంనాయక్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది గిరిజనులు తరలివచ్చారు.
అయితే, పోలీసులు మెయిన్ గేటు మూసి వారిని అక్కడే ఆపేశారు. దీంతో గేటు ముందే బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు ఐదుగురు మాత్రమే లోపలకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని సూచించగా, గిరిజన నాయకులు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో గిరిజనుల మధ్యనుంచి ఆటోలు, బైక్ లు పంపడంతో ఆగ్రహించిన వారు ఒక్కసారిగా గేటును తోసుకుని కలెక్టరేట్ ప్రాంగణంలోకి పరుగులు తీశారు.
అనూహ్యంగా వందలాది మంది తోసుకురావడంతో పోలీసులు చేసేదేమీలేక చేతులెత్తేశారు. తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా కొనసాగించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు వినాలని డిమాండ్ చేశారు. ఐదుగురు ప్రతినిధులు కలెక్టరేట్‌లోకి వెళ్లి వినతిపత్రం సమర్పించాలని పోలీసులు పలుమార్లు సూచించినా ససేమిరా అన్నారు.
ఈ సందర్భంగా దాస్‌రాం నాయక్ మాట్లాడుతూ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములన్నింటికీ పట్టాలివ్వాలని, ఎస్టీ సబ్‌కమిటీ నిధులను గిరిజనుల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని, తండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చివరకు కలెక్టరేట్ ఏఓ యూనస్వారి వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.