ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పుల్కల్, వెలుగు : రైతులు వడ్లను దళారులకు అమ్మి మోసపోవద్దని సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​పర్సన్ మంజుశ్రీజైపాల్​ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సూచించారు. ఆదివారం చౌటకూర్ మండలంలోని చక్రియాల్, గంగోజీపేట, గ్రామాలలో పీఏపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులను రాజులుగా చేసే సంకల్పంతో పని చేస్తున్నారని తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే తీసుకుంటుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. అనంతరం వారు పలువురి బాధితులను పరామర్శించారు. వారి వెంట ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్, ఉమ్మడి పుల్కల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బక్కరెడ్డిగారి కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాద్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, పీఎసీఎస్ ఉపాధ్యక్షుడు పట్లోళ్ళ ప్రభాకర్​రెడ్డి ఉన్నారు. 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కోహెడ(బెజ్జం కి), వెలుగు :  రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వీరాపూర్,లక్ష్మిపూర్, బేగంపేట, వడ్లూర్, బెజ్జంకి గ్రామాలలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత పాల్గొన్నారు. 

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

కొమురవెల్లి, వెలుగు : దాసారం గుట్ట సందర్శనలో విలేకరులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దండ్యాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాసారం గుట్ట  పవిత్రతను దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు గుట్టను భారీ హిటాచీలతో కొల్లగొడుతున్నారన్నారు. ఈ విషయమై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వార్తలు ప్రచురిస్తున్న విలేకరులను గుట్ట కొనుగోలు చేసిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని,  అతడిపై పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాసారం గుట్ట ఖరీదు చేసిన రియాల్టర్లు ఇచ్చిన మామూళ్ల మత్తులో, రెవెన్యూ, మైనింగ్, అధికారులు మునిగిపోయారని ఆరోపించారు. గుట్ట కొనుగోళ్ల ప్రక్రియ విరమించుకొని మల్లన్న ఆలయానికి అప్పగించాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొడిగం కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు, సనాది కర్ణాకర్, పబ్బోజు రాజు చారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వల్లపు రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

చేర్యాల, వెలుగు : మండలంలోని అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కె. భాస్కర్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆదివారం మండలంలోని కడవేర్గు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో ఆయన పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా వడ్లు అమ్మేందుకు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇదే అదనుగా దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సరిపోను కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్​రెడ్డి, సత్తయ్య శ్రీను, యాదయ్య, రాజు, కనకయ్య, పరశురాం పాల్గొన్నారు. 

భక్తులతో మల్లన్న ఆలయం కిటకిట

కొమురవెళ్లి మల్లికార్జునస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ ఆవారణం మారుమోగింది. స్వామికి కేషకాండన, అభిషేకం, నిత్యకల్యాణం, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లి కార్జున్, అర్చకులు, ఓగ్గుపూజరులు, ఆలయ సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. -  కొమురవెల్లి, వెలుగు

మెదక్ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ కెథడ్రల్​చర్చికి ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించారు.  చర్చి ప్రెసిబిటరీ ఇన్​చార్జి జార్జి ఎబినేజర్​ దైవసందేశాన్ని అందించారు. అనంతరం చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎస్​ఐ ఆధ్వర్యంలో నిర్వహించే సండే స్కూల్​ విద్యార్థుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. - మెదక్​టౌన్, వెలుగు