ప్రైవేట్ స్కూల్ బస్ లో చెలరేగిన మంటలు.. మెదక్ జిల్లా నార్సింగిలో ఘటన

ప్రైవేట్ స్కూల్ బస్ లో చెలరేగిన మంటలు.. మెదక్  జిల్లా నార్సింగిలో ఘటన

మెదక్, వెలుగు: మెదక్  జిల్లా నార్సింగిలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్  స్కూల్  బస్ లో మంటలు చెలరేగాయి. రామయంపేట పట్టణంలోని అక్షర టెక్నో స్కూల్ కు చెందిన బస్సులో స్కూల్  ముగిసిన అనంతరం విద్యార్థులను నార్సింగిలో ఇండ్ల వద్ద డ్రైవర్​ దింపేశాడు. 

రోజూ మాదిరిగానే డ్రైవర్  బస్సును వేణుగోపాల స్వామి ఆలయం వద్ద  పార్కింగ్  చేశాడు. రాత్రి 7 గంటల సమయంలో బస్సు నుంచి పొగలు, మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

బ్యాటరీ సమస్యతో షార్ట్  సర్క్యూట్  కావడంతో బస్సులో మంటలు చెలరేగినట్లు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. బస్సు లోపలి సీట్లు పూర్తిగా దగ్ధమవగా, డీజిల్ ట్యాంకు కు మంటలు అంటుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.