
మెదక్/టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో ఉన్న గుండువాగు బొడ్మట్ పల్లి మీదుగా కోరంపల్లి, ఎలకుర్తి వరకు పారుతుంది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి, మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లో కురిసిన వాన నీరు ఈ వాగు ద్వారా టేక్మాల్, పాపన్నపేట మండలాల్లోని చెరువుల్లోకి చేరుతుంది. టేక్మాల్ శివారులో వాగు అవతలి వైపు 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు గుండువాగు పొంగి పొర్లుతుంది. దీంతో వాగు అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. గత్యంతరం లేక దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి లోతు తక్కువగా ఉన్న చోట నుంచి వాగు దాటి పొలాలకు వెళ్లాల్సి వస్తోంది.
ఇక నాట్ల సమయంలో పొలం దున్నేందుకు ట్రాక్టర్లు, పంట కోసే సమయంలో హార్వెస్టర్లను పొలాల వద్దకు తీసుకు వెళ్లే పరిస్థితి లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి గుండువాగు మీద వంతెన నిర్మించాలని ఆ ప్రాంత రైతులు ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఫలితం లేదు. విసిగిపోయిన ఆ ప్రాంత రైతులు తమకు ఎదురవుతున్న సమస్యను తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. వాగుకు అవతలివైపు పొలాలు ఉన్న రైతులు తలా కొంత డబ్బు పోగు చేసుకుని రూ.5 లక్షల వరకు సమకూర్చుకున్నారు.
బంగారం తాకట్టు పెట్టి తెచ్చి తమ వంతుగా కొంత సాయం అందించామని కొందరు మహిళ రైతులు చెబుతున్నారు. ఇలా పోగుచేసుకున్న డబ్బుతో అవసరమైన చోట కల్వర్టులు, గుండు వాగు మీద వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా జోగిపేట రోడ్డు నుంచి గుండువాగు వరకు మట్టి రోడ్డు ఉంది. వర్షాకాలంలో బురదమయంగా మారి రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. తారు రోడ్డు నుంచి ప్రస్తుతం నిర్మించే వంతెన వరకు అరకిలో మీటరు దూరం ఉంటుంది. ఈ రోడ్డుమీద మొరం వేసి చదును చేసి వాడుకలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
నానా ఇబ్బందులు పడ్డాం
గుండువాగు అవతల 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షం పడినప్పుడు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మేము పడ్డ కష్టాలు మా పిల్లలకు రావొద్దని రైతులందరం కలిసి రూ.5 లక్షలు జమ చేసి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. నిర్మాణం చివరి దశలో ఉంది. పైసలు అయిపోవడంతో కొంతమేర పనులు మిగిలిపోయాయి. మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేస్తే మా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
తంపులూర్ రాములు, రైతు, టేక్మాల్