
- హమాలీలు లేక తూకం ఆలస్యం
- లారీల కొరతతో తిప్పలు
- అకాల వర్షాలతో తడిసి, మొలకలు వస్తున్న ధాన్యం
- పలుచోట్ల వరదకు వడ్లు కొట్టుకుపోయి నష్టం
- లబోదిబోమంటు రోడ్డెక్కుతున్న రైతులు
మెదక్/ కొల్చారం, వెలుగు: జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి రోజులు, వారాల తరబడిగా పడిగాపులుగాస్తున్నా హమాలీలు లేక తూకం కావడం లేదు. కొన్నిచోట్ల తూకం వేసినా లారీలు రాక వడ్లు రైస్‌మిల్లులకు తరలించలేకపోతున్నారు. ఈ తరుణంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయి. పలుచోట్ల రోడ్లమీద ఆరబోసిన వడ్లు వరదకు కొట్టుకుపోయి రైతులకు నష్టం వాటిళ్లుతోంది.
యాసంగిలో రైతుల నుంచి 3.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 56 వేల మంది రైతుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో 2.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. కాగా అనేక చోట్ల ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది. వరిసాగు చేసిన రైతులందరూ హార్వెస్టర్లతో పంట కోసి వడ్లను కేంద్రాల వద్దకు తీసుకువస్తున్నారు.
కానీ హమాలీల కొరత వల్ల వడ్లు తూకం వేయలేకపోతున్నారు. స్థానిక కూలీలు ముందుకు రాకపోతుండగా బీహార్ కూలీలు వస్తేగాని వడ్లు కాంటా పెట్టలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు సరిపడినన్ని లారీలు రాకపోవడంతో కాంటా పెట్టిన వడ్ల సంచులను రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో తరచు వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాలు జలమయమవుతున్నాయి. వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. కాంటాపెట్టి బస్తాల్లో నింపి రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు నానిపోతున్నాయి. కొన్నిచోట్ల మూడు, నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండడంతో వడ్లు ఎండక మొలకలు వచ్చాయి. బుధవారం పొద్దున కురిసిన వర్షానికి కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్హైవే మీద ఆరబోసిన వడ్లు వరదలో కొట్టుకుపోయాయి.
రైతుల ఆందోళనలు..
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శివ్వంపేటలో, చిలప్‌చెడ్ మండల చిట్కుల్లో, కొల్చారం మండలం రంగంపేటలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కేంద్రాల నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి చాలా రోజులవుతున్నా కాంటా పెట్టడం లేదని, అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వడ్లన్ని మొలకలు వచ్చినయ్
మేము వడ్లు సెంటర్ దగ్గర తెచ్చిపోసి పదిహేను రోజులైతుంది. లేబర్ లేరని, లారీలు వస్తలేవని ఇంకా కాంటా పెడ్తలేరు. మూడు, నాలుగు రోజుల నుంచి వరుసగా వానపడి వడ్లన్నీ నాని పది, పదిహేను సంచుల వడ్లు మొలకలు వచ్చినయి. గిట్లయితే మాకు మస్తు నష్టమైతది. ఇంకెప్పుడు వడ్లు కొంటరో ఏమో.- చందపురం నిర్మల, రైతు, కిష్టాపూర్
కాంటా పెట్టి నాలుగు రోజులైనా
మా వడ్లు 19 రోజుల కింద సెంటర్ కు తెచ్చినం. ఎదురు చూడంగ నాలుగు రోజుల కింద కాంటా పెట్టిండ్రు. కానీ లారీలు లేవని ఇంత వరకు రైస్‌మిల్లుకు పంపలేదు. నిన్న రాత్రి పెద్ద వాన పడి వడ్ల సంచులు అన్నీ నానిపోయినై.
అర్కెల బాలయ్య, రైతు, కిష్టాపూర్