
- బిహార్ నుంచి తుపాకీ తెచ్చి వెంబడించి కాల్చి చంపారు
- ఏ1గా కాంగ్రెస్ నేత, బిల్డర్ రవీందర్ రెడ్డి, ఐదుగురు అరెస్ట్
- పరారీలో విజయవాడకు చెందిన మరో ఇద్దరు నిందితులు
- మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు వెల్లడి
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్మర్డర్ మిస్టరీ వీడింది. మృతుడి సొంతూరికి చెందిన కాంగ్రెస్ నేత, బిల్డర్ సోమన్నగారి రవీందర్ రెడ్డిని కేసులో ఏ1గా తేల్చారు. అనిల్ హత్యకు ప్రధాన సూత్రధారులుగా రంగంపేటకు చెందిన అన్నదమ్ములు నాగరాజు, నాగభూషణంగా గుర్తించారు. మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సోమవారం మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు.
ముగ్గురితో ఉన్న విభేదాలే..
గతంలో నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ రెడ్డి భార్య లక్ష్మీ ముఖ్య అనుచరుడిగా అనిల్ పని చేశాడు. 2021లో కరోనా సమయంలో లక్ష్మీ మృతి చెందడంతో ఆ తర్వాత రవీందర్ రెడ్డికి అనుచరుడిగా మారాడు. సంగాయిపేట వద్ద రవీందర్ రెడ్డికి చెందిన స్థలాన్ని 25 ఏండ్లకు లీజుకు తీసుకుని పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మరికొంత భూమిని అనిల్ కౌలుకు తీసుకుని సాగు చేస్తూ మూడేండ్ల కింద నిలిపేశాడు. ఆ భూమిని ఇతరులను కూడా సాగు చేయనివ్వకపోవడంతో బీడుగా మారింది. పెట్రోల్ బంక్ విషయంలో కూడా విబేధాలు వచ్చాయి.
అనిల్ తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తున్నాడని రవీందర్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. మరోవైపు రంగంపేటకు చెందిన పాడేపు నాగరాజుతో కూడా అనిల్ కు శతృత్వం ఉంది. ఒకప్పుడు వారిద్దరు ఫ్రెండ్స్ కాగా, వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తానని నాగరాజు చెప్పడంతో అనిల్ అనుచరులు హేళన చేశారు. రంగంపేటలోని రవీందర్ రెడ్డి ప్లాట్‌ను నాగరాజు అమ్మకుండా అనిల్ అడ్డుపడ్డాడు. అంతేగాక నాగరాజు తల్లి పేరు మీద మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇంటిని అనిల్ క్యాన్సల్ చేయించాడు. ఇలాంటి కారణాలతో నాగరాజుకు అనిల్ పై కక్ష పెరిగింది.
కరోనా సమయంలో రంగంపేటకు చెందిన పాడేపు నాగభూషణం నుంచి అనిల్ రూ.6 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదు. ఇలా ముగ్గురూ కలిసి అనిల్ హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. కేసు అయితే బెయిల్ విషయాలు తను చూసుకుంటానని రవీందర్ రెడ్డి చెప్పడంతో అన్నదమ్ములైన నాగరాజు, నాగభూషణం మర్డర్ ప్లాన్ చేశారు.
ఫ్లైట్ లో బిహార్ వెళ్లి తుపాకీ కొని తెచ్చి..
నాగరాజు రూ.1.5 లక్షలు ఇవ్వగా మేడ్చల్‌లోని అతని గ్యారేజీలో పనిచేసే రంగంపేటకు చెందిన ఫరీద్ గత జూన్ 27న ఫ్లైట్ లో బిహార్ లోని నవాబ్ గంజుకి వెళ్లాడు. తనకు తెలిసిన సచిన్ కుమార్ వద్ద 0.32 తుపాకీ, ఆరు బులెట్లు కొనుగోలు చేశాడు. పోలీసులకు పట్టుబడకుండా రైలులో జమ్మికుంట వచ్చాడు. అక్కడికి నాగరాజు వెళ్లి మేడ్చల్ లోని తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. తనకు బీపీ ఉందని, ఫైరింగ్ చేయలేనని ఫరీద్ చెప్పాడు.
నాగరాజు వద్ద గ్యారేజ్ లో పనిచేసే విజయవాడకు చెందిన షాబుద్దీన్ తుపాకీతో కాల్చడం వచ్చని యూ ట్యూబ్ లో చూశానని చెప్పగా అతనికి అప్పగించారు. ఈ నెల14న అనిల్ హైదరాబాద్ వెళ్లి కారులో ఇంటికి తిరిగి వెళ్తున్న విషయం తెలుసుకుని నాగభూషణం మారుతి కారులో, షాబుద్దీన్, ఫరీద్, గ్యారేజ్ లో పనిచేసే విజయవాడకు చెందిన మరో వ్యక్తి చిన్నా స్విఫ్ట్ కారులో అనుసరించారు. కొల్చారం మండలం వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద అనిల్ కారును అడ్డుకున్నారు. ఆ వెంటనే షాబుద్దీన్ కారులోంచి దిగి పిస్టల్ తో అనిల్ పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు.
అనంతరం పారిపోయారు. అనిల్ హత్య కేసు చేధించేందుకు ఏఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఏడు స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. కేసులు ఏ1 రవీందర్ రెడ్డి, ఏ2 పాడేపు నాగరాజు, ఏ3 పాడేపు నాగభూషణం, ఏ5 ఫరీద్, వారికి సహకరించిన ఏ7 తలారి అశోక్ ను అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఏ4 షాబుద్దీన్, ఏ6 చిన్నా పరారీలో ఉన్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన 0.32 పిస్టల్, నాలుగు ఖాళీ బులెట్ షెల్ లు, 5 సెల్ ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, మారుతి 800 కారు ఇంజన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హత్య కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.