మా ప్రాణం పోయినా భూములియ్యం!

మా ప్రాణం పోయినా భూములియ్యం!
  •     మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌ ముట్టడించిన రాజ్‌‌పల్లి రైతులు
  •     పురుగు మందు డబ్బాలతో నిరసన
  •     పద్మాదేవేందర్‌‌‌‌ రెడ్డిని నిలదీసిన గ్రామస్తులు

మెదక్/ మెదక్ టౌన్, వెలుగు: ‘మంచిగ పంటలు పండే సాగు భూముల్లో కంపెనీలు పెడతారా.. ఉన్న భూములు పోతే మా గతేం కావాలి.. మేం సావనైనా సత్తాం.. కానీ.. భూములు మాత్రం ఇయ్యమంటే ఇయ్యం..’ అని రైతులు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. సాగు భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా మెదక్ మండలం రాజ్‌‌పల్లి గ్రామ రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. పురుగు మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేను చుట్టుముట్టి..

మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం జిల్లా కేంద్రమైన పట్టణ పరిసర ప్రాంతాల్లో 400 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారులు మెదక్ మండల పరిధి రాజ్‌‌పల్లి శివారులో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే నంబర్ 386లో సుమారు 200 మంది రైతుల నుంచి 340 ఎకరాలు సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు తీసుకుంటే తమకు బతుకుదెరువు కరువవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డి మెదక్ వస్తున్న విషయం తెలుసుకుని రాజ్‌‌పల్లికి చెందిన వంద మందికి పైగా రైతులు ట్రాక్టర్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తరలివచ్చి ఆందోళనకు నిర్వహించారు. ‘ఇండస్ట్రియల్ పార్క్ కోసం పంటలు పండే పొలాలు ఎలా తీసుకుంటారు..?’ అని ఎమ్మెల్యే చుట్టుముట్టి నిలదీశారు. భూములు పోతే తమ బతుకు దెరువు ఉండదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు పెట్టేందుకు తమ భూములు తీసుకోవద్దని వేడుకున్నారు. ఈ విషయంలో హామీ ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం అవుతాయంటూ ఓ రైతు తన వెంట తెచ్చిన ఎండ్రిన్ గుళికల పాకెట్ చూయించారు. కాగా, స్థానిక టీఆర్ఎస్ నాయకులు అతడిని, రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. అనంతరం వారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డికు ఓ వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

రైతుల ఆందోళనపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ పరిసర  ప్రాంత అభివృద్ధి, ఉపాధి కల్పించేందుకే ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిందని, అందుకోసమే అధికారులు భూసేకరణకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఒకవేళ రైతులు భూములు ఇవ్వలేమని ఒక రిప్రజంటేషన్​ ఇవ్వాలని,  దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

మెదక్‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్​ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల కాంపౌండ్​వాల్స్​పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మెదక్​ మున్సిపల్​ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్​గౌడ్​, ఆయా వార్డుల కౌన్సిలర్లు కిశోర్, విశ్వం, జయరాజ్, వసంతరాజ్​, షంసున్నిసా బేగం, బట్టి లలిత, జయశ్రీ, వేదవతి, కళ్యాణి, జయశ్రీ, సమీయొద్దీన్​, శేకమ్మ, శ్రీనివాస్​, కృష్ణారెడ్డి, నాయకులు బట్టి జగపతి, అశోక్​, మధుసూదన్, గంగాధర్, కృష్ణ  పాల్గొన్నారు.