
మెదక్, వెలుగు: ఎంపీ లాడ్స్‌తో చేపట్టే డెవలప్మెంట్ పనులు ప్రారంభిస్తే శంకుస్థాపనకు తనను పిలవకున్నా కనీసం స్థానిక ప్రజాప్రతినిధులనైనా పిలిచి కొబ్బరికాయ కొట్టించరా.. ఇదేం పద్దతి అని ఎంపీ రఘునందన్‌రావు అధికారులను ప్రశ్నించారు. గురువారం మెదక్కలెక్టరేట్లో జరిగిన 'దిశ' మీటింగ్‌లో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. తాను ఎంపీ అయ్యాక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎంపీ లాడ్స్ కింద ఎన్ని పనులు మంజూరయ్యాయి, ఏఏ పనులకు ప్పొసీడింగ్స్ ఇచ్చారని అడిగారు. పది పనులు మంజూరయ్యాయని, ఆ పనులన్నీ ప్రోగ్రెస్‌లో ఉన్నాయని సీపీవో ఇందిర తెలుపగా, ప్రతి పని దగ్గర తప్పకుండా శిలాఫలకం ఉండాలని ఆదేశించారు.
చేపట్టిన పనులు ఏళ్ల తరబడి కొనసాగించకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. హెల్త్ సబ్‌సెంటర్ బిల్డింగ్లు 118 మంజూరు కాగా 29 పూర్తయ్యాయని, 36 ప్రోగ్రెస్‌లో ఉన్నాయని డీఎంహెచ్ వో తెలిపారు. రూ.20 లక్షలతో పూర్తి కావడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుపగా లేఖ ఇస్తే అదనపు నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఎంపీ చెప్పారు. ఎన్హెచ్ఎం నిధులు రూ.2 కోట్లు పెండింగ్ ఉన్నాయని తెలపగా వివరాలు ఇస్తే ఢిల్లీలో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా ఆర్గానిక్ ఫామింగ్‌కు సంబంధించి పరంపరాగ కృషి పై రైతులకు ఎందుకు అవగాహన కల్పించడం లేదని డీఏవో విన్సెంట్ వినయ్‌కుమార్‌ను ఎంపీ ప్రశ్నించారు.
పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన నార్సింగ్ మండలంలో 1,094 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చామని డీఏవో చెప్పగా ఆ కార్యక్రమానికి తనను పిలవకున్నా పర్వాలేదు కనీసం జిల్లా కలెక్టర్ ను అయినా పిలవరా అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం మెదక్ నియోజకవర్గానికి ప్రత్యేక వాహనం తయారు చేయించి ఇస్తానని ఎంపీ వెల్లడించారు. అది సక్సెస్ అయితే అన్ని నియోజకవర్గాలకు వాహనాలు ఏర్పాటు చేస్తానన్నారు. మెదక్ మెడికల్‌కాలేజీకి మరికొందరు ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్టర్ రావాల్సి ఉందని అవి సమకూరితే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి తరహాలో అన్ని రకాల సర్జరీలు అందించే వీలుంటుందని ప్రిన్సిపాల్రవీందర్, సూపరిండెంటెంట్ డాక్టర్సునీత తెలిపారు.
ఎన్హెచ్ఏ అధికారులపై ఆగ్రహం
నేషనల్హైవే పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీ రఘునందన్‌రావు నేషనల్ హైవే అథారిటీ అధికారులపై మండిపడ్డారు. మెదక్- సిద్దిపేట హైవే పనులు రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా మూడేళ్లైనా ఎందుకు కావడం లేదని, 20 ఏళ్లు కావాలా అని ప్రశ్నించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదని సంబంధిత డీఈ తెలుపగా ఇంతవరకు ఆ విషయం తన దృష్టికి ఎందుకు తేలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డు పనులు పూర్తి చేయడం లేదు కానీ టోల్గేట్ మాత్రం రెడీ చేస్తున్నారు.
రోడ్డు కంప్లీట్ చేయకున్నా వాహనదారులు టోల్‌చార్జి కట్టాలా అని నిలదీశారు. అక్కన్నపేట రైల్వే క్రాసింగ్‌వద్ద ముందు చూపు లేకుండా ఆర్యూబీ నిర్మించారని, ఆ గ్రామ రైతులు పొలాలకు వెళ్లేందుకు, ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఉగ్రవాదులకు అండగా నిలచిన వారికి గుణపాఠం
సిద్దిపేట: పహల్గాంలో ఉగ్రవాదులకు అండగా నిలిచిన వారికి తగిన గుణపాఠం తప్పదని ఆడబిడ్డల సిందూరాన్ని తొలగించాలని చూస్తే ఉపేక్షించేది లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ భారత గగనతలంలోకి రావాలంటే గగనమనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ నిరూపించిందన్నారు. మీడియా తొందరపడి అసత్య ప్రచారాలను ప్రచురించవద్దని దీనివల్ల సైన్యం మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. భారత సైన్యం ఇచ్చిన అధికార ప్రకటన చూసిన తర్వాతనే వార్తను ప్రచురించాలని సూచించారు.