- నేడు తేలనున్న 1,468 మంది అభ్యర్థుల భవితవ్యం
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 402 కౌంటింగ్ కేంద్రాలు
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్‌పై కౌంట్ డౌన్ మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల పరిధిలో 403 వార్డులు ఉన్నప్పటికీ మెదక్ మున్సిపాలిటీలోని 32వ వార్డు ఏకగ్రీవమవడంతో 402 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ వార్డుల్లో తమదే గెలుపని భావిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ముందస్తుగా తమ క్యాండిడేట్లను క్యాంప్ లకు తరలించారు.
ఇక కౌంటింగ్ ఏర్పాట్లపై మూడు జిల్లాల అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాయి. మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపు చేపటనున్నారు. ముందుగా పోస్టల్‌బ్యాలెట్, తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవగా మధ్యాహ్నం వరకు అన్ని మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో 11 మున్సిపాలిటీల వారీగా 256 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వాతంత్రులతో కలిపి మొత్తం 1,045 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 11 మున్సిపాలిటీల్లో మొత్తం 3,41,808 మంది ఓటర్లు ఉండగా 2,59,821 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 76.01 పోలింగ్ శాతం నమోదైంది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్, నారాయణఖేడ్, అందోల్-జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.
మొత్తం 350 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా 1000 ఓటర్లకు ఒక టేబుల్ వినియోగించనున్నారు. 93 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 420 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 840 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య నియమించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించనున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 74 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 287 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మెదక్ మున్సిపాలిటీలో 31 వార్డులకు 112 మంది అభ్యర్థులు, రామాయంపేటలో 12 వార్డులకు 48 మంది, తుప్రాన్ లో 16 వార్డులకు 64 మంది, నర్సాపూర్ లో 15 వార్డులకు 63 మంది పోటీ చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 69,823 ఓట్లు పోలయ్యాయి.
మెదక్ మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు 11 టేబుళ్లు, రామాయంపేటలో 4 టేబుళ్లు, తుప్రాన్ లో 6 టేబుళ్లు, నర్సాపూర్ లో 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మెదక్ వెస్లీ హైస్కూల్ (గోల్ బంగ్లా) , నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీ, తూప్రాన్ లింగారెడ్డిపల్లిలోని నోబుల్ ఫార్మా కాలేజీ, రామాయంపేట ఎంపీడీవో ఆఫీస్‌లో జరగనుంది.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీల్లోని 72 వార్డులకు 326 మంది పోటీ చేశారు. ఓట్ల లెక్కింపునకు చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో ఏడు చొప్పున టేబుళ్లను, గజ్వేల్ మున్సిపాలిటీలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ లో ఏడు వార్డుల చొప్పున మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నది. దాదాపు మూడు గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.
చేర్యాల మున్సిపాలిటీకి 26 మంది , హుస్నాబాద్ మున్సిపాలిటీకి 26, దుబ్బాక మున్సిపాలిటీ 26 మంది, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 40 మంది ఎన్నికల సిబ్బందితోపాటు అదనంగా మరో ఇరవై శాతం సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో నియమించారు. కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. చేర్యాలలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దుబ్బాకలో మోడల్ స్కూల్ లచ్చపేట, గజ్వేల్‌లో గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్, హుస్నాబాద్ లో పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఫలితాల వెల్లడితో క్యాంపునకు..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాన రాజకీయ పార్టీలు గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరిగే 16 వ తేదీ వరకు గెలిచిన అభ్యర్థులు క్యాంపుల్లో ఉంచి నేరుగా మున్సిపల్ మీటింగ్ జరిగే చోటుకు తీసుకువెళ్లాలని ముఖ్య నేతలు భావిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులను ప్రత్యర్థులు తమ వైపు తిప్పుకోకుండా ముఖ్య నేతలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
